తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో ప్రతిపక్షాల గురించి చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేశారు. ఆయన నిన్న హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండాలి, కానీ అవి నిర్మాణాత్మక పాత్ర పోషించాలి తప్ప ప్రభుత్వం ఏ పని తలపెట్టినా దానిని విమర్శిస్తూ, న్యాయస్థానాలకు వెళుతూ రాష్ట్రాభివృద్ధికి అడ్డు పడకూడదు. ఇంతవరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో తమకి డిపాజిట్లు కూడా దక్కనీయకుండా ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారు? అని ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలే ఇంతవరకు విద్యుత్ సమస్యను అధిగమించలేక పోతుంటే మా ప్రభుత్వం మాత్రం ఏడాది తిరక్కుండానే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించగలిగాము. సకాలంలో పంటలకు నీళ్ళు అందించగలుగుతున్నాము. ఇవ్వన్నీ మా ప్రభుత్వం చేస్తున్న కృషికి అద్దం పడుతున్నాయి. దానిని యావత్ దేశము గుర్తిస్తోంది కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రం గుర్తించడానికి ఇష్టపడటం లేదు. శాసనసభలో ప్రజాసమస్యలపై అర్ధవంతమయిన చర్చ జరగడానికి చొరవ చూపాల్సిన ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ విలువయిన సభా సమయం వృధా చేస్తున్నాయి. ఇప్పటికయినా ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకొని రాష్ట్రాభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరిస్తూ తమ గౌరవం నిలబెట్టుకొంటే మంచిది. లేకుంటే ప్రజలే వాటికి మళ్ళీ తగిన గుణపాఠం చెపుతారు,” అని అన్నారు.
మనం కళ్ళకి ఏరంగు కళ్ళద్దాలు పెట్టుకొంటే లోకం అంతా ఆ రంగులోనే కనబడుతుంది. మంత్రి హరీష్ రావు అధికార పార్టీకి చెందినవారు కనుక అన్నిటినీ తమ కోణంలో నుంచే చూపిస్తూ చాలా చక్కగా చెప్పారు. కానీ ఆయన చెప్పినవన్నీ నిజలేనా? అంటే అనుమానమే.
తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోందని ఆయన చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజమే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే తెలంగాణా కంటే ఎంతో అభివృద్ధి చెందిన కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు ఇన్ని దశాబ్దాలయినా నేటికీ విద్యుత్ సమస్య నుండి బయటపడలేనప్పుడు, కేవలం 22నెలలోనే తెలంగాణా ఏవిధంగా బయపడగలిగింది? ఈ 22 నెలలో రాష్ట్రంలో ఎక్కడా బారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనిచేయడం ప్రారంభించలేదు. కనీసం స్థాపించబడలేదు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి 1000 మెగా వాట్స్ విద్యుత్ సరఫరా కోసం తెలంగాణా ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందం ఇంతవరకు అమలు కాలేదు. పొరుగునే ఉన్న ఆంధ్రా నుండి విద్యుత్ తీసుకోవడం లేదు. మరి అటువంటప్పుడు ఏవిధంగా విద్యుత్ సంక్షోభం నుండి గట్టెక్కగలిగింది? అంటే కేంద్రప్రభుత్వం అందిస్తున్న నిరంతర విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టు వలననే అని అర్ధమవుతుంది. కేంద్ర సహకారంతో ఈ సమస్యను అధిగమించి అదేదో తమ ఘనత అన్నట్లు చెప్పుకోవడం ప్రజలను మభ్యపెట్టడమే. ఒకవేళ కేంద్రం ఆ పధకాన్ని ఉపసంహరించుకొంటే ఏమవుతుందో హరీష్ రావుకి కూడా తెలుసు.
ఇక రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండాలి కానీ ప్రభుత్వాన్ని విమర్శించకూడదనుకోవడం తెరాస నియంతృత్వ పోకడకి అద్దం పడుతోంది. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షాలే ఉండకూడదనే ఉద్దేశ్యంతో ప్రతిపక్ష పార్టీల నేతలను, ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకొని ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో ఉన్నప్పుడు మళ్ళీ ప్రతిపక్షాలకి సుద్దులు చెప్పడం ఎందుకు? తెరాస ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు దానికి సమాంతరంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలను పూర్తిగా తుడిచిపెట్టేసే ప్రయత్నాలు కూడా చేస్తోంది. ప్రతిపక్షాలను విమర్శిస్తున్న హరీష్ రావు ఇది ప్రజాస్వామ్య పద్దతేనా కాదా చెపితే బాగుంటుంది.
ఇంతవరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో ప్రతిపక్షాలు ఓడిపోతుండటం, తెరాస ఘన విజయం సాధించడం నిజమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు చాలా ముగ్దులయిపోయి తెరాసకు ఓట్లు వేసి గెలిపిస్తూ, ప్రతిపక్షాలను ఓడిస్తున్నారా? అంటే కాదనే చెప్పవలసి వస్తుంది. చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలనేది కేసీఆర్ పద్దతి. అందుకే ప్రతీ ఎన్నికలని చాలా పకడ్బందీగా ప్రణాళికలు రచించి, పార్టీలో సీనియర్ నేతలను ఎన్నికలకు చాలా కాలం ముందు నుంచే అక్కడ మొహరించి ఆ వ్యూహాలను అమలుచేస్తూ, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతలని, చివరికి కొన్నిసార్లు ప్రతిపక్ష అభ్యర్ధులను కూడా లొంగదీసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ కారణంగా చాలా డీలాపడిపోయున్న ప్రతిపక్షాలు తెరాసను ఎదుర్కోలేక చతికిలపడుతున్నాయి. ఇటువంటి గెలుపుని నిజమయిన గెలుపుగా ఏవిధంగా భావిచ్న్హగాలము. ఒకవేళ భావిస్తే అది ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది. దాని వలన ఏదో ఒకరోజు తెరాసకే నష్టం జరిగినా ఆశ్చర్యం లేదు. కనుక ఎన్నికలలో తెరాస ఏవిధంగా గెలుస్తోందో హరీష్ రావుకి కూడా తెలిసినప్పుడు ఈవిధంగా గొప్పలు చెప్పుకోవడం ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది.
ఏ రాజకీయ పార్టీకయినా కొంత కాలంపాటే ప్రజలలో సానుకూలత ఉంటుంది. ఆ సమయంలో అదేమీ చేసినా చెల్లుతుంది. కానీ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసినా ఎల్లకాలం ఆ సానుకూలత నిలుపుకోవడం చాలా కష్టం. ఆ సంగతి తెరాస అధినేత కేసీఆర్ కి కూడా బాగా తెలుసు. అందుకే రాష్ట్రంలో ప్రతిపక్షమన్నదే లేకుండా చేసి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుంది. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఎన్నటికీ సాధ్యం కాదనే విషయాన్ని ఆయన అంగీకరించడం లేదు. ఎన్నికలలో ఏదోవిధంగా వరుసగా గెలుస్తూ, అదే నిజమయిన గెలుపని, ప్రజలు తమ వెంటే ఉన్నారని భుజాలు చరుచుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఆ భ్రమలో పడి చివరికి తామే నష్టపోకుండా జాగ్రత్తపడితే మంచిది.