చిత్రసీమలో నాలుగు చేతులా సంపాదించేది ఎవరో తెలుసా? హీరోయిన్లు మాత్రమే. ఎందుకంటే.. ఎంత పెద్ద హీరో అయినా, ఒకసారి ఒక సినిమా మాత్రమే చేయగలడు. దర్శకులు ఒక్కో ప్రాజెక్టు కోసం ఏళ్ల తరబడి శ్రమిస్తూనే ఉంటారు. హీరోయిన్లు అలా కాదు. ఒకేసారి నాలుగైదు సినిమాల్లో చేసేయొచ్చు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ అంటూ దేశమంతా చక్కర్లు కొట్టొచ్చు. ఇక కమర్షియల్స్ కి అయితే లెక్కేలేదు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్లినా, లక్షలు వచ్చి పడిపోతాయి. ఇక ఐటెమ్ గీతాలు ఒప్పుకుంటే డబ్బే డబ్బు. అలా… క్షణం తీరిక లేకుండా గడిపేస్తారు. స్టార్ కథానాయికలకైతే.. డిమాండ్ మామూలుగా ఉండదు. 2021లో చిత్రసీమ చాలా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంది. అయినా సరే, స్టార్ హీరోయిన్ల జోరు తగ్గలేదు. వాళ్ల పారితోషికాలు, వాళ్ల డిమాండ్ పైపైకి పోతూనే ఉంది. 2021 ఫినిషింగ్ టచ్‌కి వచ్చేసిన ఈ సందర్భంలో మన అగ్ర కథానాయికల జాతకం ఈ యేడాది ఎలా నడిచింది? అనేది ఒక్కసారి రివైండ్ చేసుకుంటే..
సమంత:
2021కి సమంత ఎప్పటికీ మర్చిపోలేదు. జీవితంలో అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది ఈ యేడాదిలోనే. నాగచైతన్యతో విడాకుల వ్యవహారంలో ఈ యేడాదంతా సమంత పేరు వినిపిస్తూనే ఉంది. సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయిన పేరు తనదే. ఇక సినిమాల విషయానికొస్తే.. కథానాయికగా తను నటించిన ఒక్క సినిమా కూడా బయటకు రాలేదు. కాకపోతే.. పుష్పలో అదిరిపోయే ఐటెమ్ సాంగ్ చేసింది. తన కెరీర్లో సమంత చేసిన తొలి ఐటెమ్ గీతం కావడంతో, ఈ పాటకు చాలా క్రేజ్ వచ్చింది. ఈ ఒక్క పాటకూ ఏకంగా కోటిన్నర పారితోషికం తీసుకుందన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. గుణశేఖర్ తో చేస్తున్న శాకుంతలం పూర్తి కావొచ్చింది. యశోధ ఇటీవలే మొదలైంది.
తమన్నా:
2021లో తమన్నా నుంచి కూడా మెరుపులేం లేవు. తను చేసిన… `మాస్ట్రో` ఓటీటీకి పరిమితమైంది. నెగిటీవ్ ఛాయలున్న పాత్ర పోషించడం ఒక్కటే చెప్పుకోదగిన విషయం. సిటీమార్‌లో జ్వాలారెడ్డిగా నటించింది తమన్నా. ఆ సినిమా కోసం తెలంగాణ యాస ప్రాక్టీస్ చేసింది. చిరంజీవితో `భోళా శంకర్`లో నటిస్తోంది తమన్నా. 2022లో తాను ఆశలు పెట్టుకుని మరీ ఎదురుచూస్తున్న సినిమా ఇదే.
కీర్తి సురేష్:
కీర్తికి ఈ యేడాది అస్సలు కలసి రాలేదు. `రంగ్ దే` యావరేజ్ గా నడిచింది. తమిళంలో రజనీ చెల్లాయిగా నటించిన `అన్నాత్తై` తనకు అనుకున్నంత పేరు తీసుకురాలేదు. లేడీ ఓరియెంటెడ్ చిత్రం `గుడ్ లక్ సఖీ` వాయిదాలు పడుతూనే వచ్చింది. మలయాళంలో మోహన్ లాల్ తో ఓ సినిమా చేసింది అది కూడా ఫ్లాపే. భోళా శంకర్ లో చిరు చెల్లాయిగా నటిస్తోంది కీర్తి. 2022లో ఈ సినిమా విడుదల కానుంది. సర్కారు వారి పాట కూడా అదే యేడాది వస్తుంది. సో.. తన ఆశలన్నీ 2022పైనే.
శ్రుతి హాసన్:
గత కొంతకాలంగా శ్రుతిహాసన్ టచ్‌లో లేకుండా పోయింది. అయితే 2021లో మాత్రం తనకు అదృష్టం కలిసొచ్చింది. రవితేజతో కలసి నటించిన క్రాక్ సూపర్ హిట్ అయ్యింది. పవన్ కల్యాణ్ తో జోడీ కట్టిన వకీల్ సాబ్ కూడా హిట్టే. ఇప్పుడు బాలకృష్ణతో ఓ సినిమా చేస్తోంది. దాంతో పాటుగా కొన్ని వెబ్ సిరీస్‌లపై కూడా సంతకాలు చేసింద.ఇ
పూజా హెగ్డే :
కొంతకాలంగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హావా ఈ యేడాదీ కొనసాగింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పూజాకి మంచి పేరు తీసుకొచ్చింది. తన దృష్టంతా ఇప్పుడు రాధే శ్యామ్ పైనే ఉంది. పూజా కాల్షీట్లు ఇప్పుడు హాట్ కేకులు. బాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ సంపాదించింది. ప్రస్తుతం తమిళంలో విజయ్ తో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా కోసం తన కెరీర్లోనే అత్యధిక పారితోషికం తీసుకుందని టాక్. తను చరణ్ తో కలసి నటించిన `ఆచార్య` విడుదలకు సిద్ధంగా ఉంది.
రష్మిక:
తను గోల్డెన్ లెగ్ అనే సంగతి ఈ యేడాది కూడా నిరూపించింది రష్మిక. పుష్పలో శ్రీవల్లీగా నటించింది. తనది డీ గ్లామర్ పాత్రే అయినా, నటనకు స్కోప్ ఉంది. 2021 తనకు లక్కీ ఇయర్. ఈ సంవత్సరంలోనే బాలీవుడ్ అవకాశాల్ని అందుకుంది. ఇప్పుడు తను అన్ని భాషల్లోనూ ఫుల్ బిజీ.
అనుష్క:
2021లో ఒక్క సినిమా కూడా చేయని అగ్ర కథానాయిక అనుష్కనే. నిశ్శబ్దం తరవాత తన నుంచి మరో సినిమా రాలేదు. ఈమధ్యే యూవీ క్రియేషన్స్ తో ఓసినిమా చేయడానికి సంతకాలు చేసింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. 2022లో ఈ సినిమా బయటకు వస్తుంది. ఈలోగా కొత్త సినిమాలేమైనా ఒప్పుకుంటుందేమో చూడాలి.
రకుల్ ప్రీత్ సింగ్:
రకుల్ నుంచి ఈ యేడాది రెండు తెలుగు సినిమాలొచ్చాయి. చెక్, కొండపొలం చిత్రాల్లో నటించింది రకుల్. అవి రెండూ ఫ్లాపులే. అయితే బాలీవుడ్ లో మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. అక్కడ ఓ అరడజను సినిమాలు ఒప్పుకుంది రకుల్. కొంతకాలం తను బాలీవుడ్ లోనే మకాం పెట్టేసే అవకాశాలున్నాయి.