ఏపీ, తెలంగాణలో వివిధ ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పుకుంటున్న సమూహ రియల్ ఎస్టేట్లో అనే సంస్థపై ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో రూ. 70 కోట్ల నగదుతోపాటు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పెద్దగా ఎవరికీ తెలియని సమూహ రియల్ ఎస్టేట్ వద్ద రూ. డెబ్బై కోట్లకుపై నగదు పట్టుబడటం సంచలనాత్మకం అయింది. ఈ సంస్థ ఎవరిది..? ఈ సంస్థ వెనుక ఎవరున్నారన్న ఆసక్తికర చర్చ వ్యాపార, రాజకీయవర్గాల్లో నడుస్తోంది.
సమూహ రియల్ ఎస్టేట్ సంస్థను గత ఏడాది మార్చి నెలాఖరున రిజిస్టర్ చేశారు. అంటే ఇరవై నెలలు మాత్రమే అయింది. ఈ మధ్య కాలంలో ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులు కూడా ఏమీ లేవు. కానీ రూ. కోట్లకు కోట్ల నగదు ఆసంస్థ వద్ద బయటపడింది. అనితా నేనా, అనురూప కుర్రా అనే ఇద్దరు మహిళలను ఈ సంస్థకు డైరక్టర్లుగా ఉన్నారు. ఈ సంస్థ ఏదైనా బడా రియల్ ఎస్టేట్ కంపెనీకి బినామీ లేదా.. రాజకీయ నాయకుడికి బినామీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు
ఈ సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. సాధారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు బ్లాక్ మనీతోనే వ్యవహారాలు నడుపుతూ ఉంటాయి. ఈ కారణంగానే వాటి వద్ద పెద్ద మొత్తంలో నగదు చెలామణి అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో సమూహ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఎవరిది.? వారికి నగదు ఎక్కడినుంచి వచ్చిందన్నదానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. లేదంటే ఇతర కేసుల్లాగే మురిగిపోయే అవకాశం ఉంది