హుజురాబాద్ ఉపఎన్నికలను టార్గెట్ చేసి తీసుకు వచ్చిన దళిత బంధు పథకం ఇప్పుడు కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారుతోంది. ఆ ఎన్నికల్లో వ్రతం దక్కలేదు.. ఫలితమూ చెడింది. ఇప్పుడు ఆ దళిత బంధు పథకం అమలుపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తోంది. హుజురాబాద్‌లోనే ఇంకా పూర్తి స్థాయిలో పథకాన్ని అమలు చేయలేదు. ఆ సమయంలోనే తెలంగాణ నలు వైపులా ఉన్న నాలుగు మండలాల్లో పూర్తి స్థాయిలో దళిత బంధు అమలు చేస్తామని ప్రకటించారు. దానికి సంబంధించి సన్నాహాక సమావేశాలు పెట్టారు. కానీ ఇంత వరకూ అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు కొత్త ఏడాది వస్తోంది.
కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం.. మార్చి కల్లా హుజురాబాద్‌లో ఇప్పటికే పూర్తి స్థాయిలో దళిత బంధు అమలు కావాలి.. నాలుగు మండలాల్లోనూ ఈ పాటికి లబ్దిదారులకు నగదు పంపిణీ పూర్తి కావాలి. వచ్చే మార్చికి అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గ నుంచి వంద మందికి పంపిణీ కావాలి. హుజురాబాద్‌లోనే ఇంకా లక్ష్యం పూర్తి కాలేదు. నాలుగు మండలాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే మరో .. రెండు, మూడు వేల కోట్లు కావాలి. అలాగే రాష్ట్రం మొత్తం అమలు చేయాలంటే మోర రెండు వేల కోట్ల వరకూ కావాలి.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి నిధుల సమస్య వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే కేసీఆర్ తటపటాయిస్తున్నారని అంటున్నారు. అయితే ముందు ముందు దళిత బంధుపై విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉందని … అదే జరిగితే ప్రభుత్వ విశ్వసనీయత డ్యామేజ్ అవుతుందని ఆదోళన చెందుతున్నారు. నిధుల సర్దుబాటు చూసుకుని అయినా జనవరి నుంచి మళ్లీ ప్రక్రియను ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నారు.