ఎట్టకేలకు ఓ తీపి కబురు. ఏపీలో మూసేసిన థియేటర్లు మళ్లీ తెరచుకోబోతున్నాయి. ఇటీవల ఏపీలోని థియేటర్లపై ప్రభుత్వాధికారులు దాడులు చేసి, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న థియేటర్లను సీజ్‌చేసిన సంగతి తెలిసిందే. ఆ సంఖ్య దాదాపుగా 85 వరకూ ఉంది. ఇప్పుడు ఈ థియేటర్లను మళ్లీ రీ ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్ధానిక కలక్టరేట్ కార్యాయాలకు ధియేటర్ యాజమాన్యం వెళ్లి, అందుకు సంబంధించిన ధరఖాస్తులు పూర్తి చేయాలని, జాయింట్ కలెక్టర్ అనుమతితో థియేటర్లని ఓపెన్ చేసుకోవచ్చని అధికారులు తెలియజేశారు.
జనవరి 7న ఆర్.ఆర్.ఆర్ రాబోతోంది. అందుకోసం థియేటర్లు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజ్ చేసిన థియేటర్లు మళ్లీ తెరచుకుంటాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు వాటికి క్లియరెన్స్ లభించినట్టైంది. అయితే… మరో 200 థియేటర్లని యజమానులు స్వచ్ఛందంగా మూసేశారు. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లతో మా థియేటర్లని నడపలేమని, వాళ్లంతా చేతులెత్తేశారు. ఇప్పుడు ఆ 200 థియేటర్లు తెరచుకుంటాయా, లేదా? అనేది పెద్ద సమస్య. జనవరి 1న థియేటర్లు మళ్లీ తెరిస్తే.. ప్రభుత్వాధికారులు మళ్లీ దాడి చేసి, రకరకాల కారణాల వల్ల సీజ్ చేస్తే? అప్పుడు ఎలా అన్నది కొంతమంది థియేటర్ యజమానుల ప్రశ్న.