బీజేపీ నేతలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ముస్లిం నాయకుల పేర్లతో ఊళ్లు, స్థూపాలు ఉన్నాయో వెదుక్కుని వాటి పేర్లుమారుస్తాం.. కూలగొట్టేస్తాం అంటూ వివాదాలు ప్రారంభించారు. ఇంతకు మించిన రాజకీయానికి సరకు తమ దగ్గర ఉండదనుకుంటున్నారేమో ఏమో కానీ ఇప్పుడు గుంటూరు మీదపడ్డారు. వైసీపీ సర్కార్ మీదప్రజాగ్రహ సభ పెట్టి రెండు రోజులు కాలేదు అప్పుడే సత్యకుమార్ అనే బీజేపీ కార్యదర్శి జిన్నా టవర్ పై వివాదం రేపారు. పాకిస్తాన్ జాతిపిత పేరు మీద గుంటూరులో స్థూపమా అని ఆయన ఇప్పుడే తెలిసినట్లుగా ఆశ్చర్యపోయారు.
ఆ వెంటనే ఇలాంటి వాటిలో తానే చాంపియన్ అనుకునే రాజాసింగ్ తెరపైకి వచ్చి.. కూల్చేస్తామని కొనసాగించారు. ఇక ఇతర బీజేపీ నేతలూ కోరస్గా అదే పాట పాడుతున్నారు. వీరి తీరు చూసి గుంటూరులో జనం అంతా నోళ్లు నొక్కుకుంటున్నారు. జిన్నాటవర్ అనేది ఇప్పటిది కాదు… స్వాతంత్రం రాక ముందు నుంచే ఉంది. ఎవరికీ అది పెద్ద వివాదాస్పదం అనిపిచంలేదు. కానీ ఇప్పుడు మాత్రం దాన్నిపై రచ్చ ప్రారంభించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువ.
జిన్నా టవర్ కూడా తూర్పు నియోజకవర్గం కిందకే వస్తుంది. అయితే హిందువులు కూడా ఎక్కువే ఉంటారు. మత సామరస్యానికి గుంటూరులో ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. అసలు జిన్నాటవర్ అంటే అందరికీ తెలుసు కానీ.. అసలు జిన్నా ఎవరో గుంటూరు ప్రజలు పట్టించుకోరు. జిన్నాను ఎవరూ ఆరాధించరు. కానీ ఇప్పుడు అది రాజకీయ సరుకుగా మారిపోయింది. ఇది కలసి మెలిసి ఉంటున్న గుంటూరు ప్రజల మధ్య చిచ్చు పెట్టే ఓ వికృత రాజకీయ క్రీడలాంటిదేనన్న విమర్శలు ప్రారంభమయ్యాయి.