వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా బీజేపీని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని బ్రహ్మదేవుడు కూడా జైలుకు పంపలేడని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని .. జగన్‌పై ఉన్న స్వామి భక్తిని ఘనంగా చాటు కున్నారు. బెయిల్‌పై ఉన్న నేతలు జైలుకెళ్తారంటూ బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలకు నారాయణ స్వామి ఇలా కౌంటర్ ఇచ్చారు. అంటే జగన్‌కు జైలుకు పంపడం బీజేపీ నేతల వల్ల కూడా కాదని చెబుతున్నారు.
మరో వైపు జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో బీజేపీ .. సీరియస్‌గా వైసీపీపై దృష్టి పెడితే చాప సర్దుకుని పోవడమేనని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. వారందరికీ కౌంటర్‌గా.. మీరెవరూ ఏం చేయాలేరని వైసీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే వ్యూహాత్మకంగా బీజేపీ నేతల విమర్శలకు తాము ఎక్కడా తగ్గబోమని వైసీపీ హైకమాండ్ చెప్పిస్తోంది. అయితే అదే సమయంలో అధికారిక వేదికలపై కాకుండా.. ఎప్పుడూ లూజ్ టంగ్ చేసే నేతలతో ఇలాంటి స్టేట్మెంట్ ఇప్పించడం వల్ల..అటు బీజేపీ సీరియస్‌గా తీసుకోకుండా… ఇటు వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చినట్లుగా ఉంటుందన్నట్లుగా వారు ఉభయతారకరాజకీయ వ్యూహం పాటిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఎంత తీవ్రంగా హెచ్చరించినా… బీజేపీ నేతలపై నోరెత్తడానికి వైసీపీ నేతలు సిద్దంగా లేరు. కాకపోతే బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ నేతల్ని మాత్రం కాస్త గట్టిగా విమర్శించి.., అదీ కూడా టీడీపీనే ప్రధానంగా టార్గెట్ చేసి… తమను తాము శాటిస్ ఫై చేసుకుంటున్నారు. కానీ బీజేపీని ఏమనలేకపోతున్నారన్న సందేశం మాత్రం ప్రజల్లోకి వెళ్తోంది.