రేటింగ్: 1.5/5
ఈ రోజుల్లో సినిమా అవకాశాలు ఈజీగానే వచ్చేస్తున్నాయి. కానీ నిలబెట్టుకోవడం ఎలాగో.. దర్శకులకు తెలియడం లేదు. ఓ వైపు ఓటీటీ ఊరిస్తోంది. మరోవైపు.. చిన్న సినిమాలు బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించుకుంటున్నాయి. సినిమా ఏమాత్రం బాగున్నా – మన డబ్బులు మనకు తిరిగొస్తాయన్న నమ్మకం. దానికి తోడు.. బడా నిర్మాణ సంస్థలు సైతం చిన్నసినిమాలు చేయడానికి ముందుకొస్తున్నాయి. అందుకే… ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు జోరుగా వస్తున్నాయి. శ్రీవిష్ణులాంటి మిమినం రేంజు హీరోలు తోడైతే – చిన్న సినిమాకు ఇంకాస్త కళ. చేయాల్సింది…మంచి కథ రాసుకోవడం. ప్రేక్షకుల్ని మెప్పించడమే బాకీ. `జోహార్` సినిమాతో… ఆకట్టుకున్నాడు తేజ మార్ని. `అర్జున ఫాల్గుణ`తో మరో అవకాశం దక్కించుకున్నాడు. ఈసారి తనకు ఓ మంచి హీరో వచ్చాడు. కావల్సినంత బడ్జెట్ దొరికింది. మరి… దాన్ని ఎంత వరకూ సద్వినియోగం చేసుకున్నాడు? శ్రీవిష్ణు కెరీర్‌కి ఈ సినిమా ఎంత వరకూ హెల్ప్ అవుతుంది?
అర్జున్ (శ్రీవిష్ణు)కి తన ఊరంటే ప్రాణం. స్నేహితులే సర్వస్వం. చదువు ఎక్కలేదు. ఊర్లో పాలు అమ్ముకుంటూ, స్నేహితులతో సరదాగా తిరుగుతూ గడిపేస్తుంటాడు. అయితే సడన్ గా సమస్యలు చుట్టుముడతాయి. స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం డబ్బులు కూడబెట్టాల్సివస్తుంది. రూ.4 లక్షల కోసం అరకు వెళ్లి గంజాయి తీసుకొచ్చేందుకు సిద్ధపడతాడు. ఆ మూట చేతికి వచ్చాక సమస్యలు తరుముతాయి. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా… సమస్యలు పెరిగిపోతాయి. మరి వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? ఆ మూట చుట్టూ ఉన్న కథేంటి?
ఓ హీరో. తన స్నేహితుల కోసం చేసిన సాహస కృత్యం.. ఇదీ స్థూలంగా కథ. లైన్ గా చెప్పుకుంటే.. కొత్తదేం కాదు. అలాగని మరీ… తీసి పారేయాల్సింది కాదు. ఫన్ పుట్టడానికి స్కోప్ ఉంది. థ్రిల్లింగ్ మూమెంట్స్ జొప్పించడానికి ఆస్కారం ఉంది. దానికి తోడు.. ఊరి కథ. ఆ పల్లెటూరి ఎటకారం, చమత్కారం కావల్సినంత రంగరించొచ్చు. ఫ్రెండ్ షిప్ ఎలానూ ఉంది. ప్రేమకథ కు సంగీతం.. తోడైతే.. మినిమం గ్యారెంటీ సినిమాగా మలిచే ఛాన్స్ ఉంది. కానీ… ఆ అవకాశాల్ని చేచేతులా చేజార్చుకుంటూ – ఈ సినిమాని గమ్యం లేని ప్రయాణంగా మార్చేశాడు దర్శకుడు. ఇన్ని ఆప్షన్లు ఉన్నప్పుడు అన్నింటినీ వాడుకోవడానికి చేసే ప్రయత్నంలో దేనిపైనా సరిగా ఫోకస్ పెట్టలేని ప్రమాదం కూడా ఉంది. అర్జున ఫల్గుణలో అదే జరిగింది.
రైల్వే స్టేషన్ లో… బెంచ్ మీద కూర్చుని, రంగస్థలం మహేష్.. అర్జునుడి గురించి కథ చెబుతుంటాడు. అక్కడి నుంచి సినిమా మొదలవుతుంది. మహేష్ చెప్పిన ఫోర్స్ చూసి… అభిమన్యుడు – పద్మవ్యూహం అనే భారీ పదాలు చూసి కచ్చితంగా భూమి బద్దలైపోయే కథే అనుకుంటారంతా. కానీ… కట్ చేసేలోగా చప్పున చల్లారిపోతుంది. చైల్డ్ వుడ్ ఎపిసోడ్స్… వాళ్ల ఫ్రెండ్ షిప్ పరమ రొటీన్ గా ఉంటాయి. సోడా తయారు చేయడంలో.. తిరుగులేని చేయిగా – శ్రీవిష్ణు పాత్రని పరిచయం చేశాడు దర్శకుడు. దాన్ని మళ్లీ ఎప్పుడైనా వాడుకుంటాడేమో అనిపిస్తుంది. కానీ… అది కూడా ప్రోపర్ గా జరగలేదు. హీరోకి ముగ్గురు ఫ్రెండ్స్. కానీ.. ఒక్కరి క్యారెక్టర్ కూడా సరిగా.. పండలేదు. హీరోయిన్ పాత్రతో కెమిస్ట్రీ సరిగా కుదరలేదు. బలమైన విలన్ లేడు. సుబ్బరాజు పాత్రని సైతం చివర్లో తేల్చేశాడు. ఫ్రెండ్ షిప్… ఏడుపులు, సెంటిమెంట్ అన్నీ ఉన్నా, అవి కూడా ఫోర్డ్స్ గా సాగాయి. ఛేజింగులూ, ఫైట్సూ ఉన్న థ్రిల్లింగ్ మిస్సయ్యింది. `ఊరూ.. రైతులు.. అప్పులూ` అంటూ శ్రీవిష్ణు ఓ సందర్భంలో రొటీన్ లెక్చర్లు ఇస్తున్నప్పుడు `ఇవేవో నీ కేబుల్ టీవీలో ప్రవచనాల్లా చెప్పుకో` అంటుంది ఓ పాత్ర. ఆ డైలాగులన్నీ అలానే సాగాయి. చివర్లో అయినా ఏదో ట్విస్టు వస్తుంది.. వస్తుంది అని చూసిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది.
శ్రీ విష్ణు తన పాత్రకెప్పుడూ అన్యాయం చేయలేదు. `మావయ్యగారండీ.. పాలండే.. `అంటూ గోదావరి యాసని భలేగా పలికాడు. తనలో ఈజ్ ప్రతీ సీన్ లోనూ కనిపించింది.కానీ.. ఈ సినిమాకి అదొక్కటే చాలదు. కథల ఎంపికలో కూడా కాస్త పరిపక్వత చూపించాలి. కొత్తదనం నిండిన కథల్ని కథల్ని ఎంచుకునే విష్ణు కూడా అప్పుడప్పుడూ ఇలా దారి తప్పుతాడని ఈ సినిమాతో అర్థమైంది. స్నేహితుల గ్యాంగ్‌లో ఉన్నవాళ్లంతా బాగానే చేసినా, ఎవరి పాత్రా సరిగా ఫోకస్ అవ్వదు. కథానాయికగా ప్రమోషన్ పొందిన అమృత అయ్యర్‌కి కూడా పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. సుబ్బరాజు. నరేష్, శివాజీ రాజా ఇలా పేరున్నవాళ్లనే ఎంచుకున్నా.. వాళ్లూ చేయగలిగిందేం లేదు.
పల్లెటూరి అందాల్ని కెమెరా బాగానే పట్టుకుంది. గోదారోళ్లు పాట బాగుంది. తెరకెక్కించిన తీరూ నచ్చుతుంది. అది మినహా ఏ పాటా.. వినసొంపుగా లేదు. యాక్షన్ మూమెంట్స్ ని థ్రిల్లింగ్ గా చూపించలేకపోయాడు దర్శకుడు. డైలాగుల్లో చాలా వరకూ బూతులు వినిపించాయి.కొన్ని సెన్సార్ కత్తెరని కూడా దాటుకుని వచ్చాయి. దర్శకుడు ఓ సాదా సీదా కథని రాసుకుని, దాన్ని మరింత సాధారణంగా తీసి చూపించాడు. బిలో యావరేజ్ కథల్నీ ఒప్పుకుని, డబ్బులు పెట్టే నిర్మాతలు ఉన్నారా? అనే డౌటు ఈ కథతో కలుగుతుంది.
ఫినిషింగ్ టచ్: ఇది పద్మవ్యూహం కాదు.. తను అర్జునుడూ కాడూ..
రేటింగ్: 1.5/5