రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది అంటే అర్థం ఏమిటి? చిన్న భార్య చెడ్డదనే కదా?!! రాజకీయ నాయకులు కూడా ఇంతకంటె విపులంగా విడమరచి చెప్పడం అంటూ జరగదు. ఏ విషయంలో అయినా మీడియానుంచి తమకు ప్రశ్నలు ఎదురైనప్పుడు.. నర్మగర్భంగా సంకేతాలు ఇవ్వడం మాత్రమే నాయకులు చేస్తుంటారు. ఆ సిద్ధాంతం ప్రకారం గమనిస్తే.. ఇప్పుడు కేంద్రమంత్రి దత్తాత్రేయ మాటలను బట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.
మంగళవారం నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. కేంద్ర కేబినెట్‌లో తెరాస చేరబోవడం గురించి తనకు సమాచారం లేదని సెలవిచ్చారు. తనకు సమాచారం లేదంటూ ఆయన సెలవిచ్చారంటే.. దాని అర్థం తెరవెనుక దానికి సంబంధించిన వ్యవహారం ఏదో నడుస్తూ ఉన్నట్లే కదా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఊహగానాలు నడుస్తున్నాయి. ఎందుకంటే.. కేంద్రంలో తన పార్టీ వారిని మంత్రులుగా చొప్పించడం గురించి కేసీఆర్ చాలా కాలం నుంచి తన వంతు ఆలోచనలు చేస్తున్నట్టుగా ఎప్పటినుంచో పుకార్లు ఉన్నాయి.
ఇటీవలి కాలంలో ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసినప్పుడు కూడా ఈ పుకార్లకు మరోసారి ప్రాణం వచ్చింది. పైగా కేంద్రంలోని భాజపా పట్ల తెరాస నాయకుల మాటల్లో వైఖరిలో హఠాత్తుగా చాలా మార్పు వచ్చేసింది. మేం అంశాల వారీ మద్దతు ఇస్తాం.. వారి విధానాల్ని సపోర్ట్ చేస్తాం అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో దత్తన్న కేంద్రంలో వారి చేరిక గురించి తనకేమీ తెలియదని అంటున్నారంటే.. మొత్తానికి ఏదో నడుస్తోందనే అనుమానాలే కలుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్రమంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం చాలారోజులుగా ఉంది. ఆ విస్తరణలోనే గులాబీ తనయ కవితకు మంత్రి పదవి దక్కినా ఆశ్చర్యం లేదని పలువురు భావిస్తున్నారు.