వైకాపా సీనియర్ నేత ఎం.వి. మైసూరా రెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆయన గత కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీని వీడి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభిద్దామనుకొన్నారు కానీ ఎందుకో ఆ ఆలోచన విరమించుకొన్నారు. ఆయన పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న తెదేపా గత అయనను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఆయనను ఆకర్షించగలిగితే ఆయన శిష్యుడు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి కూడా తెదేపాలోకి రావచ్చును. వారితో తెదేపా ఎంపి సిఎం రమేష్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం ఉంది.
కడప జిల్లాకే చెందిన జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెదేపాలో చేరడానికి చాలా కాలంగా ఎదురుచూపులు చూస్తున్న సంగతి తెలిసిందే. వైకాపాకి కంచుకోట వంటి కడప జిల్లాలో ఆ పార్టీ బలహీనపరచగలిగితే జగన్మోహన్ రెడ్డి ఇక తమను ఎదుర్కోలేకపోవచ్చునని తెదేపా భావిస్తోంది.
కడపతో బాటు కర్నూలు జిల్లాలో కూడా వైకాపాను బలహీనపరిచే ప్రయత్నాలలో భాగంగా ఆ పార్టీకి చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియని తెదేపాలో ఆకర్షించేందుకు తెదేపా చేస్తున్న ప్రయత్నాల గురించి తెలిసిందే. భూమా నాగిరెడ్డి తెదేపాలో చేరినా చేరకపోయినా మైసూరా రెడ్డి మాత్రం ఏదో ఒకరోజు తెదేపాకి తిరిగి రావడం ఖాయమని తెదేపా నేతలు నమ్ముతున్నారు.