వైసీపీకి మంచి మాటలు చెప్పి ఆ పార్టీ నేతల చేతిలోనే దారుణంగా దాడికి గురైన.. అవమానం భరిస్తున్న సుబ్బారావు గుప్తా ఇప్పుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ముందూ వెనుక ఎవరున్నారో కానీ ఆయన ఆధ్వర్యంలో విజయవాడలో ఆర్యవైశ్య ఐక్యతాసభ నిర్వహించారు. అన్ని పార్టీల వైశ్య నేతలను పిలిచారు. ఆ సమావేశానికంటే ముందే గుప్తా వంగవీటి రాధాకృష్ణతో సమావేశం అయ్యారు. వంగవీటితో ఏం చర్చించానో తాను చెప్పలేనని సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత జరిగిన ఆర్యవైశ్య ఐక్యతాసభలో మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
ఒంగోలులో చోటా రాజన్, డీ గ్యాంగులు దిగాయన్నారు. పద్దతి మార్చుకకపోతే వారు కోటి రూపాయలతో చేసే పనిని లక్ష రూపాయలతో చేస్తానని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ తనకు అపాయింట్ మెంట్ ఇచ్చారని.. కానీ దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోకుండా.. వారితో క్షమాపణలు చెప్పించకుండా జగన్ను కలవబోనని ప్రకటించారు. ఐక్యతాసభలో ఆర్యవైశ్య నేతలంతా తమపై జరుగుతున్నదాడులను తిప్పికొట్టాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఈ సభలో ఓ వైసీపీ నాయకుడు.. ఇది టీడీపీ సభలో ఉందని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయడంతో అతన్ని మిగతా నేతలు గట్టిగానే మందలించారు. కారణం ఏదైనా కానీ సుబ్బరావు గుప్తాపై దాడి జరిగినప్పుడు ఆయన డిఫెన్స్లోనే ఉన్నారు. తనకు విపక్షాల నుంచి ముప్పు ఉందని హడావుడి చేశారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గుప్తాకు మనోధైర్యం ఎవరో కల్పిస్తున్నారని అందుకే ధిక్కరించి మాట్లాడుతున్నారన్న భావన వైసీపీలో వ్యక్తమవుతోంది.