ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ మళ్లీ అమరావతితో రాజకీయ ఆటలు ప్రారంభించింది. మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడం.. సీఆర్డీఏను పునరుద్ధరించడంతో అభివృద్ధి చేయకోయినా… కనీసం ఉన్నది ఉన్నట్లుగా అయినా ఉంచుతారేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాజధానిలోని కొన్ని గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం విాదాస్పదమవుతోంది.
రాజధానిలోని 19 గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా చేయాలని నిర్ణయించారు. సీఆర్డీఏ చట్టంలో 29 రెవెన్యూ గ్రామాలను రాజధాని ప్రాంతంగా పేర్కొన్నారు. కానీ 19 గ్రామాలతోనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారట. మరో పది గ్రామాలు ఏమయ్యాయి అంటే… వాటిని విడిగా మరో కార్పొరేషన్‌లో కలుపుతున్నారు. గత ఏడాది మార్చిలోనే మంగళగిరి-తాడేపల్లి మున్సిపాల్టీల తోపాటు మరో 21 గ్రామాలను కలిపి కార్పొరే షన్‌గా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాటిలో వీటిని కలిపారు. గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ గతంలో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మున్సిపాల్టీకి అప్పటి వరకు ఎన్నికలు జరగలేదు.
ఐదు లక్షల జనాభా దాటి న తర్వాత మునిసిపల్ ప్రాంతాన్ని కార్పొ రేషన్‌గా ఏర్పాటు చేస్తారు. 10 లక్షల జనాభా దాటితే దానిని మహా నగర పాలకసంస్థగా అప్‌గ్రేడ్ చేస్తా రు. మంగళగిరి, తాడేపల్లిలో ప్రస్తుతం రెండు, మూడు లక్షలకు మించి జనాభా లేరు… అలాగే రాజధాని పరిధిలోని పందొమ్మిది గ్రామాల్లోనూ కలిపి లక్షకు మించి జనాభా ఉండరు. అయినా కార్పొరేషన్ల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చారు. అంటే సీఆర్డీఏ ఒక్కటే కానీ కార్పొరేషన్లు మాత్రం రెండు. మాస్టర్ ప్లాన్ మార్చవద్దని హైకోర్టు పదే పదే చెబుతున్నా ఎందుకు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని రైతులు, న్యాయనిపుణులు అంటున్నారు.
అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే వివాదాల జోలికి వెళ్లకుండా మాస్టర్ ప్లాన్ ప్రకారం 29 గ్రామాలను కలిపి కార్పొరేషన్ చేసేవారు. కానీ ప్రభుత్వ ఉద్దేశం వివాదాల్లోకి నెట్టడమేనని అందుకే వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు.