ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఢిల్లీ నుంచి సిగ్నల్ రాగానే ఆయన ప్రత్యేక విమానం గన్నవరం నుంచి బయలుదేరుతుంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తే ప్రధానంగా అమిత్ షాతో భేటీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఆతర్వాతే ప్రధాని మోడీ . అయితే ఈ సారి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ దొరికింది కానీ… అమిత్ షాది దొరకలేదు. రెండురోజుల పాటు ఎదురు చూసి స్పందన లేకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చేశారు. అమిత్ షా కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ సంకేతాలు రాగానే మళ్లీ ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఢిల్లీలో ఎంత మంది కేంద్రమంత్రుల్ని కలిసినా అమిత్ షా చెప్పకపోతే పని కాదన్న అభిప్రాయం ఇప్పటికే అందరిలో ఉంది. అదినిజం కూడా . కీలకమైన అంశాల్లో అమిత్ షా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి కూడా అన్ని విషయాల్లో జోక్యం చేసుకోరు. ఆయన కూడా అమిత్ షాను కలవమనే చెబుతారు. అందుకే ఢిల్లీ పర్యటన అసంపూర్తిగానే ఉందని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాను ఢిల్లీ పర్యటనకు వెళ్లి అప్పులకు అనుమతి విషయంలో తాత్కాలికంగా సక్సెస్ అయ్యారు.
కానీ ఈ మూడు నెలలకు తాము ప్రతిపాదించిన మొత్తం అప్పులు తీసుకునేలా ఒప్పించడానికి ప్రయత్నించాల్సి ఉంది. తాత్కలికంగా రెండున్నర వేల కోట్లు అప్పు పుట్టించగలిగారు కానీ..తర్వాత అనుమతి రాకపోతే ఇబ్బందికరం అవుతుంది. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుటున్నారు. అయితే అమిత్ షా సమయం ఇస్తారా లేదా అన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.