రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు… సకల శాఖల మంత్రిగా ప్రాచుర్యంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి టిక్కెట్ల వివాదం ఏమిటో అర్థం కావడం లేదట. ఆయన మీడియా ముందుకు వచ్చి టిక్కెట్ల వివాదంపై అచ్చంగా ఇదే మాట మాట్లాడారు. మొత్తంగా ఆయన కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తోందని అందరూ అనుకుంటున్న సమయంలో అసలు వివాదం ఏంటో ఆయనకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చేశారు. టిక్కెట్ల వివాదం ఇంకా ముదురుతుందని అనుకోవడం లేదని.. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి తాము టిక్కెట్ రేట్లపై నిర్ణయం తీసుకోలేదని.. ఆయన ఏడాదికో ఒకటో.. రెండో సినిమాలు మాత్రమే చేస్తారన్నారు. ఆయన సినిమా యాబై లేదా వంద.. లేదా రెండు వందల కోట్లు కలెక్షన్లు వసూలు చేస్తాయని దాని కోసం ప్రత్యేకంగా రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. టిక్కెట్ రేట్ల తగ్గింపు వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలతో కమిటీ వేశామని.. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పుకొచ్చారు. పెట్టిన పెట్టుబడులు వారం రోజుల్లో రాబట్టుకోవాలని వారు చూస్తున్నారని సజ్జల చెప్పుకొచ్చారు.
సజ్జల రామకృష్ణారెడ్డి స్పందన చేతుల కాలక ముందే ఆకులు పట్టుకుందామన్న చందంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేసి.. అన్ని పెద్ద సినిమాలను పూర్తి స్థాయిలో దెబ్బకొట్టే ప్రయత్నం చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు.. ఒక్కొక్కరు తిరగబడుతూండటంతో… డ్యామేజ్ కంట్రోల్‌కు దిగినట్లుగా అనుమానిస్తున్నారు. అసలు తమకేమీ తెలియదన్నట్లుగా సజ్జల మాట్లాడుతూండటంతో ఈ వ్యవహారాన్ని ఎవరో ఒకరిపై తోసేసి.. ప్రభుత్వం సర్దుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న భావన వ్యక్తమవుతోంది.