ఇది అనూహ్యమన ఘటన. దేశంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రధానమంత్రి మోడీ పంజాబ్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనలేకపోయారు. రైతులు ఆయన కాన్వాయ్‌కు అడ్డం పడి నిరసన వ్యక్తం చేయడంతో ఏం చేయాలో తెలియక.. ఇరవై నిమిషాల సేపు ఆయన కాన్వాయ్ రోడ్ పైనే ఉంది. తర్వాత అతి కష్టం మీద ఆయనను భద్రతా అధికారులు భటిండా ఎయిర్‌పోర్టుకు తరలించగలిగారు. అక్కడ్నుంచి మోడీ ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఎన్నికల సందర్బంగా ప్రదాని మోడీ ఫిరోజ్‌పూర్ లో ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. ఇందు కోసం మొదటగా ఆయన ఢిల్లీ నుంచి భటిండా ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ్నుంచి హెలికాప్టర్లో ఫిరోజ్‌పూర్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో హెలికాఫ్టర్ ఎగరడానికి పర్మిషన్ లభించలేదు. దీంతో మోడీ రోడ్ మార్గం ద్వారా వెళ్లాలనుకున్నారు. మోడీ రోడ్ మార్గం ద్వారా వస్తున్నారని తెలిసిన వెంటనే రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. దారిలో ఉన్న ఫ్లై ఓవర్లన్నింటిపై వద్ద నిరసనకారులు ట్రక్కులు అడ్డుపెట్టి రోడ్డును బ్లాక్ చేశారు.
ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇరవై నిమిషాలు చూసి మోడీ వెనక్కి తిరిగి భటిండా ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు. సెక్యూరిటీ లోపాల కారణంగా మోడీ పర్యటన రద్దయిందని కేంద్ర హోంశాఖ ప్రకటన జారీ చేసింది.భద్రతా లోపాలపై వెంటనే నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని.. 10వేలమంది పోలీసులతో పటిష్ట సెక్యూరిటీ ఏర్పాటు చేశామని సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెలిపారు. హెలికాఫ్టర్ ద్వారా రావాల్సిన ప్రధాని మోదీ.. ముందస్తు సమాచారం లేకుండా రోడ్డుమార్గంలో వచ్చేశారని .. అదే సమస్యకు కారణమైందని పేర్కొన్నారు.
ఈ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎయిర్‌పోర్టులో తాను ప్రాణాలతో బయటపడ్డానని.. ఈ విషయంలో సీఎం చన్నీకి కృతజ్ఞతలంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రధాని రోడ్డు మార్గంలో వెళ్తే నిరసనలు ఇలాగే ఉంటాయని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.