సీఎం కేసీఆర్ ముందస్తుకు ఎందుకు వెళ్లారు ? పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.. మరో టర్మ్ పెంచుకోవడానికి అనువైన సమయం అనుకుని ఆరు నెలల ముందుగానే ముందస్తుకెళ్లి అద్భుత విజయం సాధించారు. అదే సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకెళ్లలేదు ? ముందుకెళితే ఆరు నెలల పాలనా సమయం నష్టపోవడం తప్ప ఏమీ ఉండదని ఆయనకు తెలుసు కాబట్టే వెళ్లలేదు. ఇప్పుడు ఏపీలో ముందస్తు ఎన్నికల గురించి చర్చ జరుగుతోంది. తాము వంద శాతం మేనిఫెస్టోను అమలు చేశామని.. ప్రజలు తమకు ఎంతో మద్దతుగా ఉన్నారని.. 175 స్థానాలూ గెలుస్తామని చెబుతున్నారు.
ఇక టీడీపీ కూడా అనేక సార్లు చాలెంజ్ చేసింది. నిజంగా పాలనకు ప్రజా మద్దతు ఉంటే…. నిర్ణయాలకు ప్రజా మద్దతు ఉంటే తక్షణం ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఎన్నో సార్లు సవాల్ చేసింది. కానీ వైసీపీ సర్కార్ మాత్రం మీరు రాజీనామా చేయమని టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చింది కానీ తాము రాజీనామా చేస్తామని చెప్పలేదు. అయితే ఇటీవల టీడీపీ నేతలే ముందస్తు ఎన్నికల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నడపలేని దుస్థితి వచ్చేసిందని .. ఏదో ఓ కారణం చెప్పి ముందస్తుకు వెళ్లిపోతారని.. రెడీగా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలకు చెబుతున్నారు.
దీనిపై వైసీపీ నేతలు ఒకే మాటతో స్పందిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు ఉండవని అంటున్నారు. ముందస్తుకు వెళ్లడానికి జగన్కేమైనా పిచ్చా అని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు నేరుగా అంటున్నారు. ముందస్తుకు వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందని అనుకున్నవారే అలా చేస్తారని.. కానీ జగన్ ఆలోచనలు అలా ఉండవను ఆయన చెప్పుకొచ్చారు. ముందస్తుకు వెళ్తే ప్రయోజనం ఉండదని సజ్జలకు అర్థం అయినట్లుగా ఉందని వైసీపీలోని కొన్ని వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే కేసీఆర్ ముందస్తుకు వెళ్తే ఆయనతో పాటు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ సన్నాహాలు చేసుకుంటున్నారన్న అభిప్రాయం మాత్రం వైసీపీలోనూ బలంగా ఉంది.