రాజధాని గ్రామాలు మొత్తం ఇరవై తొమ్మిదింటినీ సీఆర్డీఏలో నోటిఫై చేశారు. కానీ ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం 19 గ్రామాలను ఓ మున్సిపల్ కార్పొరేషన్‌గా..మరికొన్ని గ్రామాలను మంగళగిరి -తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌గా మారుస్తోంది.ఎందుకిలా చేస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ నిగూఢమైన వ్యవహారం ఏదో ఉండకపోతే ఇలా చేసే అవకాశం లేదని అందరికీ అర్థమవుతోంది. అందుకే అన్ని గ్రామాల ప్రజలు నిర్మోహమాటంగా అమరావతి కార్పొరేషన్ ప్రజాభిప్రాయసేకరణలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ అనుకూలంగా మాట్లాడటం లేదు. భిన్నాభిప్రాయాలు ఉన్నా.. అదే నివేదికలో రాసేవారేమో కానీ.. ఆ గ్రామాల్లో అవేమీ కనిపించడం లేదు.
ఒకే అభిప్రాయం వినిపిస్తోంది. అన్ని గ్రామాలను కలిపి కార్పొరేషన్ చేయాలి కానీ.. కొన్ని గ్రామాలను మాత్రం విడిగా వద్దనే అంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో తెలియదు కానీ … అమరావతి కార్పొరేషన్‌గా చేసిన తర్వాత రాజధాని గ్రామాల్లో ఆరు వేల ఎకరాలు అదానీ సంస్థకు తాకట్టు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం మాత్రం ఉద్ధృతంగా సాగుతోంది. ఈ విషయంలో ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారని అందుకే.. మూడు రాజధానుల బిల్లు వెక్కి తీసుకోవడం… అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు పేరుతో హడావుడి ప్రారంభించారని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కూడా ఇలాంటి విమర్శలే చేశారు. ప్రభుత్వం అమరావతి విషయంలో ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం లేదని.. అడ్డగోలు కుట్రలు చేసేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే వంద శాతం నమ్ముతున్నారు. ప్రభుత్వంపై అమరావతి రైతులకు ఒక్కటంటే ఒక్క శాతం నమ్మకం కూడా లేకుండా పోయింది. అలాంటి పరిస్థితిని ఏపీ ప్రభుత్వం తెచ్చుకుంది.