ఆర్ఆర్ఆర్ సినిమాపై తాజా గా వివాదం రాజుకుంది. అల్లూరి కుటుంబ సభ్యులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం తో దాని కి మూవీ యూనిట్ స్పందించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
అల్లూరి కుటుంబ సభ్యుల అభ్యంతరాలు:
అల్లూరి సీతారామరాజు వంశానికి చెందిన అల్లూరి సౌమ్య అనే మహిళ ఈ సినిమా కి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వ రాదని కోర్టు ను ఆశ్రయించింది. అల్లూరి సీతా రామరాజు పేరు పెట్టి సినిమా తీస్తూ, ఆయనను బ్రిటిష్ వారి తరఫున పని చేసిన పోలీసు గా చూపించడం తప్పని, దీని వల్ల స్వతంత్ర సమర యోధుడి చరిత్ర భావి తరాలకు తప్పుగా చెప్పినట్లు అవుతుందని ఆవిడ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాకుండా సీత అనే పాత్రను రామ రాజు కి ప్రేయసి గా చూపిస్తూ ఉన్నారని, ఇది కూడా తప్పని, రామ రాజు కోసం సీత అన్న యువతి ప్రాణ త్యాగం చేయడం వల్ల ఆయన ఆ పేరును స్వీకరించారే తప్పించి వారిద్దరి మధ్య ప్రేమ బంధం లాంటిది లేదని వివరించిన సౌమ్య, దర్శకులు ఈ సినిమాలో రామ రాజు సీత పాత్రల మధ్య రొమాంటిక్ బంధాన్ని చూపించడాన్ని తప్పుపట్టారు. అంతే కాకుండా స్వాతంత్ర సమర యోధుల పేర్లు కల్పిత కథ కోసం నేరుగా వాడడాన్ని కూడా ఆవిడ తప్పుపట్టారు.
స్పందించిన చిత్ర యూనిట్
అల్లూరి సౌమ్య వేసిన పిటిషన్ పై చిత్ర యూనిట్ వ్రాత పూర్వక స్పందన తెలియజేసింది. ఇది కల్పిత కథ అని ప్రారంభం నుండి చెబుతూనే ఉన్నామని, మహా వీరులని స్ఫూర్తిగా తీసుకుని మాత్రమే ఈ కథను అల్లుకున్నామని, సినిమా చూసిన తర్వాత ఏవైనా అభ్యంతరాలు ఉంటే అప్పుడు తెలియజేయమని, ప్రస్తుతానికి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకోమని చిత్రయూనిట్ అల్లూరి సౌమ్య ని అభ్యర్థించింది.
కొమరం భీమ్ పాత్ర పైనా వివాదం
మరో వైపు తెలంగాణ నేపథ్యం లో ఉన్న కొమరం భీమ్ పాత్ర పై కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. కొమరం భీమ్ పాత్ర కు ముస్లిం టోపీ ధరింప చేయడం పట్ల బిజెపి పార్టీ మొదటి నుండి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కొమరం భీమ్ పాత్ర ని విధానాన్ని తప్పు పడుతూ వ్యాఖ్యలు చేశారు
ఈ వివాదం చివరికి ఏ మలుపు తిరుగుతుందో అన్నది వేచి చూడాలి.