2022 తెలుగు సినిమా క్యాలెండర్ చాలా చప్పగా మొదలైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. రేపు (జనవరి 7) ఆర్.ఆర్.ఆర్ విడుదలయ్యేది. కొత్త యేడాది… తొలి వారం… అద్భుతమైన ఓపెనింగ్ లభించేది. కానీ… ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడింది. ఆర్.ఆర్.ఆర్ బరిలోంచి తప్పుకున్నా, దాన్ని సరిగా వాడుకోలేకపోయారు మిగిలిన నిర్మాతలు. జనవరి 7న పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు. రానా నటించిన `1945` ఒకటి రిలీజ్ కి రెడీ అయ్యింది. రానా సినిమా అనేది పేరుకు మాత్రమే. ఈ సినిమాకి ఏమాత్రం పబ్లిసిటీ జరగలేదు. దానికి తోడు.. ఈసినిమాని రానా ఎప్పుడో వదిలేశాడు. ఈసినిమాకి రానా డబ్బింగ్ కూడా చెప్పలేదు. నిర్మాతతో ఏవో గొడవల వల్ల… ఈ సినిమా ప్రమోషన్లకు రానని ముందే చెప్పేశాడట. అయినా సరే.. 1945 విడుదల అవుతోంది.
దానితో పాటు ఆది సాయికుమార్ నటించిన `అతిథి దేవోభవ` వస్తోంది. ఆది సాయికుమార్ హిట్టు కొట్టి చాలా ఏళ్లయ్యింది. `ప్రేమ కావాలి` తరవాత ఆది మొహంలో హిట్టానందమే కనిపించలేదు. తన సినిమా కనీసం యావరేజ్ అయిన దాఖలా లేదు. దాంతో ఈ సినిమాని పట్టించుకున్న నాథుడే లేడు. వేయి శుభములు కలుగునీకు అనే మరో చిన్న సినిమా కూడా ఈ శుక్రవారమే వస్తోంది. మూడు సినిమాలపై ఎలాంటి బజ్ లేకపోవడంతో ఈ వారం బాక్సాఫీసు చాలా డల్ గా కనిపిస్తోంది. పోనీ సంక్రాంతికి అదిరిపోయే సినిమాలు వచ్చేస్తున్నాయ్ అంటే అదీ లేదు. `బంగార్రాజు` తప్ప పెద్ద సినిమా కనిపించడం లేదు. బంగార్రాజు వచ్చేంత వరకూ సంక్రాంతి శోభ లేనట్టే.