పంజాబ్లో ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన రాజకీయ పర్యటన రైతుల ఆగ్రహంతో ఆగిపోయింది. అయితే మోడీ కాన్వాయ్ ఇరవై నిమిషాల సేపు రోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగలేదు. మోడీపై అత్యంత తీవ్రమైన వ్యతిరేకత ఉండే దక్షిణాది రాష్ట్రాలు అయిన తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. ఆన్ లైన్ క్యాంపెయిన్.. గాల్లోకి నల్ల బెలూన్లు వదలడం వంటివి చేశారు కానీ ఆయనను అడ్డుకోవడం వంటివి జరగలేదు. సాధ్యం కాదు కూడా. ఎందుకంటే ప్రధాని భద్రతా రేంజ్ ఆ స్థాయిలో ఉంటుంది.
పంజాబ్లో అయినా ప్రధాని భద్రతా స్థాయి మారదు. కానీ అక్కడ ఆయనకు భిన్నమైన పరిస్థితి ఎదురయింది. సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది. అయితే ఇది నిజంగా తప్పిదం అయితే అత్యంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. కానీ సున్నితంగా మారిపోయింది. రాజకీయం అయిపోయింది. ఓ వైపు బీజేపీ.. మరో వైపు కాంగ్రెస్.. ఇతర పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు . మోడీ కూడా ప్రాణాలు దక్కించుకోవడం గురించి సీరియస్ కామెంట్లు చేశారు. దీంతో ఆయన చివరికి సెక్యూరిటీని కూడారాజకీయాలకు వాడేసుకుంటున్నారన్న విమర్శలు ప్రారంభమయ్యాయి.
పంజాబ్లో బీజేపీకి ఎలాంటి అవకాశాలు లేవని ఇప్పటికే అన్ని సర్వేలు తేలాయి. ఒకటి రెండు ఎమ్మెల్యే స్థానాలు వస్తే గొప్పగా నిర్ధారించారు. మాజీ సీఎం కెప్టెన్ అమరీంద్తో పొత్తు పెట్టుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మోడీ ఇలా సెక్యూరిటీ గేమ్ ప్లే చేస్తున్నారన్న విమర్శలు కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్నాయి. పార్టీల రాజకీయం ఇప్పుడు ప్రభుత్వాల మధ్యకు చేరుతోంది. దీంతో ఈ వివాదం ఎటు వైపు తిరుగుతుందోనన్న ఆసక్తి ఏర్పడుతోంది.