వచ్చే ఎన్నికల్లో రాజకీయ పొత్తులపై ఏపీలో విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై చంద్రబాబునాయుడు కుప్పంలో జనసేనతో పొత్తు అంశంపై స్పందించారు. వన్ సైడ్ లవ్ కరెక్ట్ కాదన్నారు. చంద్రబాబు మాటలతో జనసేనతో పొత్తుకు టీడీపీ సిద్ధంగా ఉందని సంకేతాలు పంపినట్లయింది. ఇక చాయిస్ జనసేనదే అని ఆని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. నిజానికి జనసేనను వదిలి పెట్టాలని ఆయన గతంలోనూ అనుకోలేదు. టీడీపీ హయాంలో నాలుగేళ్ల పాటు చంద్రబాబు ఆయనకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ తర్వాత పవన్ కల్యాణ్ రూటు మార్చారు.
శేఖర్ రెడ్డి వంటి వారి గురించి వైసీపీ మీడియా చేసే ఆరోపణలను టీడీపీనేతలపై చేశారు. శ్రీరెడ్డి లాంటి వాళ్ల తిట్లను టీడీపీనే చేయిస్తోందని ఆరోపిస్తూ దూరమయ్యారు. ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు పవన్ను కలిసి పోటీ చేద్దామని ఆహ్వానించారు. కానీ ఆయన రాలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే విధానానికి కట్టుబడి ఉన్నారని అనుకోవాలి. ఎన్నికల తర్వాత జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం అధికారికంగా బీజేపీతో పొత్తులో ఉంది. కానీ ఆ రెండు పార్టీలు ఎక్కడా కలిసి నడుస్తున్నట్లుగా లేదు.
అయినప్పటికీ జనసేన పార్టీని చంద్రబాబు ఎక్కడ ఆకర్షిస్తారో అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు టెన్షన్ పట్టుకున్నట్లుగా ఉంది. చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ఆయన అవసరమైతే ఎవర్నైనా లవ్ చేస్తారని.. తర్వాత వదిలేస్తారని విమర్శలు ప్రారంభించారు. చంద్రబాబు జనసేనతో పొత్తుల గురించి ప్రస్తావిస్తే.. ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తే ఓ పద్దతిగా ఉంటుంది కానీ బీజేపీ అధ్యక్షుడికి ఎందుకంత ఆరాటం అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.