ఏపీలో పార్టీ పెట్టే అంశంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరో సారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ స్పష్టంగా ఏపీలో పార్టీ పెట్టబోనని మాత్రం చెప్పలేదు. వైఎస్ఆర్ను ప్రేమించే తెలంగాణ ప్రజల కోసమే పార్టీ పెట్టానని.. తన జీవితం ఇక్కడే ముడిపడి ఉందన్నారు. ఎవరైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చని ..,తాను గతంలో అదే చెప్పానన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని కూడా ఓ మాట చెప్పి అందరికీ ఓ క్వశ్చన్ మార్క్ కూడా వదిలి పెట్టారు.
ఇవాళ అధికారంలో ఉన్న వారు .. తాము ఎప్పటికీ అధికారంలో ఉంటామని అనుకోకూడదని.. అలాగే అధికారంలో లేని వారు.. అధికారంలోకి రారని అనుకోకూడదని షర్మిల వ్యాఖ్యానించారు. తాను ఏపీలో పార్టీ పెడుతున్నాన్న ప్రచారం వల్ల తెలంగాణలో సీరియస్ నెస్ తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నందువల్ల షర్మిల తాజా ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అదే సమయంలో ఆరు నూరైనా తాను తెలంగాణను వదిలి పెట్టి ఏపీలో రాజకీయాలు చేయబోనని ఆమె ప్రకటించలేదు. ఓ చాయిస్ మాత్రం ఎలాగోలా ఉంచుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
సోదరుడు జగన్తో విబేధాల కారణంగా ఆమె ఏపీలోనూ రాజకీయం చేసే అవకాశాలు ఉన్నాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో పార్టీ పెట్టకూడదన్న రూలేం లేదు కదా అని గత వారం వ్యాఖ్యానించడం వైరల్ అయింది. దానిపై ఇప్పుడు షర్మిల క్లారిటీ ఇచ్చినట్లయింది. కానీ ఇందులోనూ కాస్త సస్పెన్స్ ఉండటమే రాజకీయం.