మాట్లాడుకుందామని ఏపీ ప్రభుత్వమే మొదట పిలిచింది..కానీ అపాయింట్మెంట్లు మాత్రం ఇవ్వలేదు. తర్వాత ఇండస్ట్రీ వాళ్లు వస్తామన్నారు కానీ సమయం ఇవ్వలేదు. చివరికి “మా” ప్రెసిడెంట్గా గెలిచిన బంధువు మంచు విష్ణు సన్మానం ప్రపోజల్ కూడా పెట్టారు. కానీ ఇంత వరకూ అనుమతి రాలేదు. అయితే అనూహ్యంగా టిక్కెట్ల అంశంపై చర్చిస్తా అనగానే రామ్గోపాల్ వర్మకు అపాయింట్మెంట్ ఇచ్చేశారు పేర్ని నాని. ట్వీట్ వార్తో సమాధానాలు చెప్పుకోలేని ప్రశ్నలను ఆర్జీవీ అడుగుతూండటంతో ఆయనను సైలెంట్ చేయడానికో… లేకపోతే అంత బాధ్యత ఉంటే నేరుగా వచ్చి కలవమంటే పారిపోతాడని అనుకున్నారో కానీ.. వచ్చి మాట్లాడాలని పేర్ని నాని ఆఫర్ ఇచ్చారు.
దానికి ఆర్జీవీ ఓకే అన్నారు. త్వరలో సమయం కేటాయిస్తా అని పేర్ని నాని నాలుగు రోజుల కిందట ప్రకటించారు. ఆ త్వరలో కూడా వచ్చేసింది. పదో తేదీన అంటే ఆదివారం రోజున అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ రోజున అమరావతి సచివాలంయలో మధ్యాహ్నం పూట వచ్చి కలవాలని పేర్ని నాని ఆర్జీవీకి సమాచారం పంపారు. దానికి ఆర్జీవీ అంగీకరించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. టిక్కెట్ల అంశంపై ప్రస్తుతం ఏం జరిగినా వాదోపవాదాలు మాత్రమే.., అసలు సబ్జెక్ట్ ప్రభుత్వం నియమించిన కమిటీ వద్ద ఉంది.
మరి పేర్ని నాని, ఆర్జీవీ ఏం చర్చిస్తారు … ఆర్జీవీ చెప్పే మాటలను పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఇంప్లిమెంట్ చేయగలరు అన్నది ఎవరికీ తెలియదు. అయితే ఇండస్ట్రీ తరపున ఇంత వరకూ ఈ అంశాలపై ఎవరితోనూ మాట్లాడేందుకు అంగీకరించని ప్రభుత్వం… ఆర్జీవీని మాత్రం ప్రత్యేకంగా ఆహ్వానించడం మాత్రం విశేషంగానే మారింది. మీటింగ్ తర్వాత ఆర్జీవీ కూడా టిక్కెట్ రేట్ల తగ్గింపును సమర్థిస్తే టాలీవుడ్ పరువు గంగలో కలిసిపోతుంది.