ప్రతి సంక్రాంతికి ముందుగా కుప్పంలో పర్యటించే చంద్రబాబు ఈ సారి కూడా మూడు రోజు పాటు పర్యటిస్తున్నారు. అయితే ఈ సారి ఆయన రోడ్ షోలతో పాటు పార్టీకి చికిత్స చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా గత ముఫ్పై ఏళ్లుగా టీడీపీ నాయకులుగా చెలామణి అవుతూ.. అధికార దర్పం చూపించిన వారిపై మండి పడుతున్నారు. మీరు తప్ప ఇతర నాయకులు ఎదగలేదా.. ముఫ్పై ఏళ్లుగా మీ మొహాలే చూస్తున్నానని చిరాకుపడుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకుని తాను పరువు పోగొట్టుకున్నానని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కుప్పంలో టీడీపీ ఎదురుగాలికి ప్రధాన కారణం అధికార పార్టీ ప్రలోభాలు.. బెదిరింపులు మాత్రమే కాదు అక్కడి టీడీపీ నాయకత్వం కూడా అని స్పష్టమైన నివేదికలు టీడీపీ వద్ద ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నా లే్కపోయినా.. చంద్రబాబు నియోజకవర్గం పేరుతో లోకల్ నేతలు తామే సీఎం అన్నట్లుగా ఫీలైపోయేవారు. నియోజకవర్గానికి కావాల్సినన్ని అభివృద్ధి పనులు మంజూరు చేసే చంద్రబాబు పార్టీని పట్టించుకునేవారు కాదు. ఆ నేతలను మాత్రం బాగా చూసుకునేవారు. వారినే నమ్మేవారు. అదే ఇప్పుడు ఆయనకు గడ్డు పరిస్థితి తీసుకొచ్చింది.
ఇప్పుడు కుప్పంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఓ టీమ్‌ను పార్టీ కార్యాలయంలో ఉంచి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ.. అక్కడ స్థానిక నాయకత్వాన్ని కొత్త వారిని ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజా పర్యటనలో ఆయన టీడీపీ కుప్పం సీనియర్లకు గట్టిగానే షాకులు ఇస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా లోపాలు తెలుసుకుంటే .. కుప్పం ట్రాక్‌లోకి వస్తుందని.. అధికార పార్టీ ప్రలోభాలు, బెదిరింపులు పని చేయవని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు సీరియస్‌గా ఉంటారో మళ్లీ ఆరంభశూరత్వమే చూపిస్తారో చూడాలన్న కామెంట్లు టీడీపీలో వినిపిస్తున్నాయి.