బాహుబలితో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. తను ఇప్పుడు అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్. తెలుగులో సాహో అంతంత మాత్రంగానే ఆడినా, నార్త్ లో దుమ్ము రేపింది. అదీ… ప్రభాస్ స్టామినాకు నిదర్శం. `రాధే శ్యామ్` కి తెలుగులో పెద్దగా బజ్ లేదు. కానీ.. నార్త్ లో ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలికి ముందు, ఆ తరవాత ప్రభాస్ పారితోషికంలో ఊహించనంత మార్పు వచ్చింది. తన బ్రాండ్ విలువ పెరిగింది.
అయితే.. మిగిలిన హీరోల్లా.. తను తన బ్రాండ్ వాల్యూని క్యాష్ చేసుకోవడం లేదు. ఇటీవల తనకు చాలా కమర్షియల్ ఆఫర్లు వచ్చాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభాస్ ని ఎంచుకోవాలని భారీ ప్రయత్నాలు చేశాయి. వందల కోట్ల ఆఫర్లు ఇస్తామన్నాయి. కానీ… ప్రభాస్ ఒప్పుకోవడం లేదు. ఈనెల రోజుల వ్యవధిలోనే ఏకంగా వంద కోట్ల రూపాయల ఆఫర్లని కాదన్నాడని టాక్. మామూలుగా అయితే, కమర్షియల్ యాడ్ల రూపంలో భారీగా సంపాదించే అవకాశం ఎప్పుడు వచ్చినా, ఎవరూ వదులుకోరు. క్రేజ్ ఉన్నప్పుడే వీలైనంత పిండుకోవడానికి చూస్తుంటారు. పైగా సినిమాల్లా.. యాడ్ల కోసం నెలలు, సంవత్సరాలూ కేటాయించాల్సిన అవసరం లేదు. చేతిలో ఎన్ని బ్రాండ్లు ఉంటే అంత వాల్యూ అనుకుంటుంటారు. కానీ ప్రభాస్ మాత్రం వాటి గురించి పట్టించుకోవడం లేదు. తన ఫోకస్ కేవలం సినిమాలపైనే ఉంది. మిగిలిన విషయాల్ని ప్రభాస్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే కోట్ల రూపాయల్ని వదులుకుంటున్నాడు.