ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు మొత్తం వదిలేశారు. సలహాదారుల నియామకాలను ఓ యజ్ఞంలా కొనసాగిస్తున్నారు. అదీ కూడా ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన జ్ఞానేంద్ర రెడ్డి అనే మాజీ ఎంపీకి సలహాదారు పదవి ఇచ్చారు. ఆయన ఎన్నారై వ్యవహారాల్లో సలహాలిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో ఎంత మంది సలహాదారులున్నారో ఎవరికీ స్పష్టతలేదు. ఒక్కో అంశంపై … నలుగురు ఐదుగురు సలహాలిచ్చేందుకు పదవుల్లో ఉన్నారు.
వారందరికీ కేబినెట్ హోదాతో లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. కానీ ఆయన శాఖలకు సంబంధించి బయటకు వచ్చే జీవోల్లో కనీస నిబంధనలు కూడా పాటించరు. ఫలితంగా కోర్టుల్లో ఎదురు దెబ్బలు తింటున్నారు. రాజకీయంగా ఉపయోగపడతారు అనుకునేవారికి పదవులు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. వారేమీ చేయకపోయినా.. ఎలాంటి సహాలు ఇవ్వకపోయినా.. కనీసం సలహాలు తీసుకునేందుకు సిద్ధపడకపోయినా.. వారికి కేవలం ప్రజాధనాన్ని ఆర్థిక ప్రయోజనాల రూపంలో కల్పించేందుకు ఇలాంటి సహాదారుల పదవులు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇంత మంది సలహాదారులను పెట్టుకుని ప్రజలకు ఎలాంటి మేలు చేస్తున్నారో ఇంత వరకూ ప్రభుత్వం చెప్పలేదు. కానీ ఇలాంటి సలహాదారులు మాత్రం ప్రతీ చోటా పెరిగిపోయారు. అదీ కూడా ఒకే వర్గానికి పెద్ద ఎత్తున ఈ సలహాదారు పదవులు ఇస్తున్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా లెక్క చేయడం లేదు.