తెలంగాణ బీజేపీపై హైకమాండ్ సీరియస్‌గా దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ అగ్రనేతలందర్నీ రంగంలోకి దింపుతోంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్ తదనంతర పరిణామాలతో రాజకీయంగా మరింత దూకుడుగాఉంటున్న బీజేపీ.. వీఐపీ లీడర్స్‌ను రంగంలోకి దింపడం ద్వారా ఆ వేడిని కొనసాగించాలని అనుకుంటోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి .. టీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు చేసి వెళ్లిపోయారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ పై టీఆర్ఎస్ నేతలు యధావిధిగా ఎదురుదాడికి దిగారు. ఈ ఆదివారం అసోం సీఎంను రంగంలోకి దింపుతున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ వరంగల్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉపాధ్యాయ, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై బండి సంజయ్‌తో కలసి హిమాంత బిస్వా శర్మ ధర్నా చేయనున్నారు. రాబోయే రోజుల్లో దాదాపుగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందర్నీ రంగంలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బెంగాల్ వ్యూహాన్నే తెలంగాణలోనూ బీజేపీ పాటిస్తున్నట్లుగా ఉంది. బెంగాల్‌కు ప్రతి వారం ఓ ఢిల్లీ స్థాయి నేత వెళ్లేవారు. చేరికలు నిర్వహించేవారు. ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. ఆ పర్యటన వల్ల చివరికి రెండు పార్టీల మధ్య హోరాహోరీ అన్న పరిస్థితి వచ్చింది.ఇప్పుడు తెలంగాణలోనూ అదే వ్యూహం అమలు చేయడం ప్రారంభించారు. ముందు ముదంు చేరికలు కూడా పెరిగితే… రాజకీయంగా ఉద్రిక్తత పెరగడం ఖాయమని అనుకోవచ్చు.