ఒమెక్రాన్ ఎఫెక్ట్ తీవ్రరూపం దాల్చింది. సెలబ్రెటీలు కరోనా బారీన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది `మాకు కరోనా వచ్చింది` అంటూ బహిరంగంగా ప్రకటించేశారు. మెల్లగా కరోనా భయాలు మళ్లీ మొదలైపోయాయి. ఈ ఎఫెక్ట్ షూటింగులపై పడింది. పెద్ద హీరోలంతా క్రమంగా షూటింగులకు మొహం చాటేస్తున్నారు. దాంతో షూటింగులు ఎక్కడికక్కడ బంద్ అయ్యాయి. హైదరాబాద్ లో జరుగుతున్న `గాడ్ ఫాదర్` షూటింగ్ వాయిదా పడింది. `ప్రాజెక్ట్ కె` పరిస్థితి కూడా అంతే. ఈ వారంలో `ప్రాజెక్ట్ కె`కి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ జరగాల్సివుంది. దాన్ని వాయిదా వేసినట్టు సమాచారం. సంక్రాంతి తరవాత బాలకృష్ణ – గోపీచంద్ మలినేని షూటింగ్ ప్రారంభం కావాలి. ఆ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా వాయిదా పడే అకాశాలున్నాయి. సెకండ్ వేవ్ సమయంలో… ప్రభుత్వాలు చెప్పకుండానే చిత్రసీమ జాగ్రత్తలు తీసుకుంది. షూటింగులు ఆపేస్తున్నామని ప్రకటించాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. తెలుగులోనే కాదు… అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ఈ విషయంలో బాలీవుడ్ ముందే తేలుకుంది. అక్కడ కరోనా ప్రభావం మరింత ఎక్కువ. అందుకే పెద్ద హీరోలు షూటింగులకు రామని చెప్పేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలు తమ అప్పాయింట్మెంట్లను వాయిదా వేసుకున్నారు. ఇక నాగార్జునకి `బంగార్రాజు` ప్రమోషన్లలో దిగక తప్పడం లేదు.