భారతీయ జనతా పార్టీ నేతలు .. తమ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. జాతీయ నేతలు వచ్చి తెలంగాణలో సవాళ్లు చాలెంజ్‌లు చేస్తున్నారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయించిన పోలీసులతోనే కేసీఆర్‌ను అరెస్ట్ చేయిస్తామని తాజాగా సవాల్ చేస్తున్నారు బీజేపీ నేతలు. సొరంగంలో దాక్కున్నా సరే తీసుకొచ్చి అరెస్ట్ చేయిస్తాంటున్నారు. తెలంగాణ బీజేపీ నేతలందర్నీ వరుస పెట్టి టార్గెట్ చేసి మరీ అరెస్టులు చేయడంతో తెలంగాణలో రాజకీయం మారిపోయింది.
బీజేపీ నేతలు ముఖ్యంగా బండి సంజయ్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయినప్పటి నుండి కేసీఆర్ అరెస్ట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆయనను జైలుకు పంపుతామని చాలా సార్లు హెచ్చరించారు. ఆయన మాటలపై టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి కూడా చేస్తూ వస్తున్నారు. కానీ బండి సంజయ్ మాత్రం తగ్గడం లేదు. దీంతో టీఆర్ఎస్ నేతలు బీజేపీవి మాటలేనని.. తాము చేతల్లో చూపిస్తామన్నట్లుగా ఒక్క సారిగా విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకూ చేసిన ఘాటు వ్యాఖ్యలన్నింటిపై కేసులు పెట్టేసి బుక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే బీజేపీ నేతలు మాత్రం దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు.
తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఏడాదిలోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని గట్టి ప్రచారం జరుగుతున్న కారణంగా దానికి తగ్గట్లుగానే దూకుడు పెంచింది. కేసీఆర్‌పై అసంతృప్తి ఎక్కువగా ఉందని గట్టిగా నమ్ముతున్నకారణంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు కూడా తెలంగాణలో పెరగబోతోందన్న ప్రచారం ఊపందకుంటోంది. ఈ క్రమంలో కేసీఆర్‌ను జైలుకు పంపే అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. రెండు పార్టీల మధ్య సీరియస్ రాజకీయయుద్ధం జరిగుతూంటే మాత్రం.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ.. తాను చేయాలనుకున్నది చేస్తే… రాజకీయం ఉద్రిక్తంగా మారడం ఖాయమనుకోవచ్చు.