రాజీనామా చేసి అమరావతి ఎజెండాగా ఉపఎన్నికలకు వెళ్తానని రఘురామకృష్ణరాజు ప్రకటించడం అధికార వైసీపీలో కాస్త ఆందోళనకు కారణం అవుతోంది. ఈ విషయాన్ని తాము సీరియస్‌గా తీసుకోబోమంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు కానీ ఆయన అలా చెప్పడంలోనే ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నారో అర్థం అవుతుందని కొంత మంది విశ్లేషిస్తున్నారు. నిన్నామొన్నటి వరకూ రఘురామపై అనర్హతా వేటు కోసం వైసీపీ నేతలు తీవ్రంగా శ్రమించారు. కానీ వర్కవుట్ కాలేదు. కానీ ఇప్పుడు ఆయనే రివర్స్‌లో రాజీనామా అంటున్నారు. దానికి వైసీపీ సంతోషపడాల్సిందే. కానీ ఆయన తన రాజకీయ వ్యూహం అమరావతి కేంద్రంగా ప్రకటించడమే వైసీపీ ఆందోళనకు కారణం.
రఘురామ రాజీనామా చేస్తే ఆరు నెలల్లో ఉపఎన్నిక వస్తుంది. రఘురామ బీజేపీలో చేరుతారో లేదో స్పష్టత లేదు. కానీ ఆయన ఏదో ఓ పార్టీలో చేరడం కన్నా అమరావతి రాజధానిగా ఉండాలా వద్దా డిసైడ్ చేయండి అని ఎన్నికలకు వెళ్తే ఏ పార్టీలోనూ చేరకుండా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారు. అలా దిగడం వల్ల అన్ని పార్టీలూ మద్దతిస్తాయి. ఎందుకటే అమరావతికి అన్ని పార్టీల మద్దతు ఉంది. అదే్ జరిగితే.. నర్సాపురం ఫలితం రాష్ట్రంలో రాజకీయ మార్పులకు కారణం అవుతుంది. ప్రస్తుతం పరిస్థితి ఆరు నెలలకిందట ఉన్నంత ఏకపక్షంగా లేదని వైసీపీ నేతలకూ తెలుసు.
ఇటీవలి కాలంలోప్రభుత్వాన్ని అనేక సమస్యలు చుట్టుముట్టాయి. అవి సామాన్యుల వరకూ చేరాయి. ఓటీఎస్ సహా పన్నుల పెంపు.. నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ ఇబ్బంది పెడుతున్నాయి. ఇక రోడ్ల సమస్య ఉండనే ఉంది. వీటికి తోడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్న విమర్శలు యువత నుంచి వస్తున్నారు. ఇలాంటి వాటికి పరిష్కారం లేకుండా ఉపఎన్నికలకు వెళ్తే ఇబ్బందికరమే. అది వచ్చే ఎన్నికలపై ప్రభావంచూపుతుంది. ఈ పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకున్న వైసీపీ.. రఘురామ రాజీనామా చేసినా ఆమోదం పొందకుండా వ్యూహం పన్నే అవకాశం ఉందంటున్నారు.
రఘురామ రాజీనామా చేసినా తాము ఇచ్చిన అనర్హతా పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని వారు స్పీకర్‌ను పట్టుబట్టే అవకాశంఉంది. ఆ పిటిషన్‌పై నిర్మయం తీసుకోవాలంటే.. స్పీకర్ కొంత సమయం తీసుకోక తప్పదు. దీంతో ఆలస్యం అవుతుంది. ఒక వేళ స్పీకర్ రాజీనామాను ఆమోదించదల్చుకుంటే … అనర్హతా పిటిషన్‌ను తిరస్కరించి.. వెంటనే రాజీనామా ఆమోదిస్తారు. కానీ రెండింటిలో ఏదైనా జరగడం కష్టమే. అదే రాజకీయం.