ప్రభుత్వాలు వివిధ సామాజికవర్గాల్లో వెనుకబడిన వారిని వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రత్యేకంగా కార్పొరేషన్ల ద్వారా రుణాలిస్తూ ఉంటాయి. ఎస్సీ కార్పొరేషన్ , బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్… గత ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి కూడా రుణాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కార్పొరేషన్ల పేరుతో పథకాలను నిధులను బదిలీ చేస్తున్నారు. కొత్తగా ఎవరికీ రుణాలు ఇవ్వడం లేదు. గత రెండున్నరేళ్లుగా ఒక్క రూపాయి కూడా లోన్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు గతంలో ఇచ్చినరుణాల వసూలుకు మాత్రం ప్రత్యేక దృష్టి సారించారు.
ఎస్సీ కార్పొరేషన్ కింద గతంలో అనేక మంది రుణాలు ఇచ్చారు. కొన్ని వేల మంది స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకున్నారు. కొంత మంది నష్టపోయారు..మరికొంత మంది అభివృద్ధి సాధించారు. అయితే.. చాలా మంది లోన్లు కట్టడం మానేశారు. సహజంగానే ఇలాంటి లోన్ల విషయంలో .. ప్రభుత్వాలు పట్టుదలకు పోవు. నోటీసులు జారీ చేసి సైలెంటవుతాయి. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వాటన్నింటినీ వసూలు చేయాలని నిర్ణయించుకుంది. నోటీసులతో పాటు హెచ్చరికలు పంపుతోంది. తక్షణం రుణాలు తిరిగి చెల్లించాలని ఆదేశిస్తోంది.
చాలా మంది కార్పొరేషన్ల లబ్దిదారులు రుణాలు తిరిగి చెల్లించలేదు. వీరందరికీ తిరిగి చెల్లించాలని నోటీసులు వెళ్తున్నాయి. కనీసం రూ. వెయ్యి కోట్ల అయినా తిరిగి వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒక వేళ వారు కట్టడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోతే వన్ టైం సెటిల్మెంట్ తరహాలో మరో పథకం అమల్లోకి తెచ్చి… వారికి మేలు చేసే కార్యక్రమం చేపట్టినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు ఓటీఎస్ అమలు చేస్తూంటే …. రుణాలను మాత్రం ఎప్పుడో తీసుకున్నా వదిలి పెడతారా ?