ఏపీ నుంచి చిత్రసీమకు మరో పిడుగులాంటి వార్త. ఏపీలో థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్గ దర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుఝామున 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించింది. దాంతో పాటు థియేటర్లల 50 శాతం ఆక్యుపెన్సీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే… సంక్రాంతికి రాబోయే సినిమాలన్నీ సగం టికెట్లే అమ్ముకోవాలన్న మాట. ఇది నిజంగా పెద్ద దెబ్బే. రాత్రి 11 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తే.. సెకండ్ షోపై ఆశలు వదులుకోవాలి. లేదంటే… సెకండ్ షో టైమింగ్ మార్చాలి. 11 గంటల లోపే సెకండ్ షో అయ్యేలా టైమింగ్స్ మార్చాలి. సంక్రాంతికి బంగార్రాజు ఒక్కటే పెద్ద సినిమా. కాకపోతే.. హీరో, రౌడీ బోయ్స్ కూడా ఎక్కువ థియేటర్లలో విడుదల కానున్నాయి. వీటిపై కొత్త నింబంధనల ప్రభావం పడబోతోంది. తెలంగాణలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే… సంక్రాంతి సినిమాల జోష్ పూర్తిగా పోయినట్టే. సినిమా విడుదల విషయంలో బంగార్రాజు ఇప్పుడు ఆలోచనలో పడతాడేమో…?