సినిమా టిక్కెట్ల వివాదానికి సంబంధించి ఏదో పరిష్కారం వచ్చేస్తుందని ఆర్జీవీ – పేర్ని నాని భేటీపై మీడియా హైప్ క్రియేట్ చేసింది. కానీ చివరికి ఇద్దరూ లంచ్‌కు ముందు రెండు గంటలు.. లంచ్ తర్వాత రెండు గంటలు సమావేశమై తమ చేతుల్లో ఏమీ లేదని ఒకరికొకరు చెప్పుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అయితే మధ్యలో లంచ్ మాత్రం కలిసే చేశారు. మంచి రొయ్యల వేపుడు, మటన్, చికెన్లతో ప్లెయిన్ బిర్యానీ ఆర్జీవీకి మంత్రి వడ్డించారు. అదొక్కటే చర్చల ఎపిసోడ్లో హైలెట్‌గా నిలిచినట్లుగా కనిపిస్తోంది.
మీటింగ్ తర్వాత ఫిల్మ్ మేకర్‌గా తను చెప్పాలనుకున్నది చెప్పడానికి మాత్రమే వచ్చానని.. ఇంకేవిషయాలతో తనకు సంబందం లేదని ఆర్జీవీ చెప్పారు. టిక్కెట్ రేట్ల నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధం ఉండదన్నారు. సమస్య పరిష్కారం కావాలని..అది తన చేతుల్లో లేదని మీడియాకు చెప్పి వర్మ వెళ్లిపోయారు. తర్వాత మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని .. టిక్కెట్ రేట్ల అంశంపై ఎవరైనా ఏదైనా చెప్పుకోవాలంటే ప్రభుత్వం కమిటీ వేసిందని ఆ కమిటీకి చెప్పుకోవాలన్నారు. ఆ కమిటీలో తాను భాగం కాదన్నారు. దాంతో ఆర్జీవీ తో భేటీసో అసలు సబ్జెక్టే లేదని ఆయన చెప్పిటనట్లయింది. అంతే కాదు ఆర్జీవీ వాదనకు కౌంటర్‌గా.. తాము అన్నీ చట్ట ప్రకారమే చేస్తున్నామని.. సినిమాటోగ్రఫీ చట్టం గురించి చెప్పారు.
అంటే ఇద్దరూ ఎవరి వాదన వారు వినిపించారు.. కానీ ఒకరి వాదనను ఒకరు అంగీకరించలేదన్నమాట. అయితే చర్చలు మాత్రం సుహృద్భావ వాతావరణంలో జరిగాయని.. వంద శాతం సంతృప్తినిచ్చిందని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. బహుశా ఆ సంతృప్తి వర్మకు.. లంచ్ విషయంలో వచ్చి ఉంటుందన్న సెటైర్లు సహజంగానే పడుతున్నాయి.