తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు కేసీఆర్ జైలుకెళ్లే సమయం దగ్గర పడిందికాబట్టి సానుభూతి కోసమే ఇతర పార్టీల నేతల్ని ప్రగతి భవన్కు పిలిపించుకుని మాట్లాడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ విదేశాలకు పోయినా.. ఎక్కడ ఉన్నా గుంజుకొచ్చి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రం సీరియస్గా ఉందని ఏ క్షణమైనా జైలుకెళ్లడం ఖాయమన్నారు.
బండి సంజయ్ ఇలా హెచ్చరికలు జారీ చేసిన కాసేపటికే.. ప్రగతి భవన్ నుంచి కేంద్రంపై మండిపడుతూ కేసీఆర్ చేసిన ప్రకటన బయటకు వచ్చింది. కేంద్రం ఎరువుల ధరలు పెంచిందని..ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం వ్యవసాయ ఖర్చులను రెట్టింపు చేయడం దుర్మార్గమని ఆ ప్రెస్నోట్లో విమర్శించారు. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర చేస్తుందని .. ఎరువుల ధరలు తగ్గించేలా పోరాటం చేస్తామని.. దేశ వ్యాప్తంగా ఆందోళనలను చేపడుతామని కేసీఆర్ ప్రకటించారు. బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ అంశంపై మోడీకి కేసీఆర్ రాసిన లేఖ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీల నేతలను కూడగట్టే ప్రయత్నంలో ఉన్న కేసీఆర్ ఏ ఉద్యమం అయినా జాతీయ స్థాయిలో చేస్తామని చెబుతున్నారు. ఆయన ప్రయత్నాలను రాష్ట్ర బీజేపీ నేతలు తేలికగా తీసుకుంటున్నారు. అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికేనని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలు కాక మీదకు మారిపోయాయి.