అల వైకుంఠపురములో విడుదలై ఈరోజుతో రెండేళ్లు. డౌటే లేదు. అల్లు అర్జున్ కెరీర్లో బెస్ట్ సినిమా ఇది. త్రివిక్రమ్ సృష్టించుకున్న మరో మైలు రాయి ఇది. తమన్ కెరీర్లో సూపర్ ఆల్బమ్ ఇది. మొత్తంగా టాలీవుడ్ చూసిన బిగ్గెస్ట్ హిట్. అయితే.. పూజా హెగ్డే రేంజ్‌ని మరింతగా పెంచిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాతో పూజా – ఇంకో నాలులు అడుగులు ముందుకేసింది. `మేడమ్.. మేడమ్ అంతే` అంటూ బన్నీ ఎలాగైతే పూజా వెనుక పడి, ఆకాశానికి ఎత్తేశాడో, ఈ సినిమా తరవాత.. పూజా వెంట కూడా నిర్మాతలు అలానే పడుతున్నారు. అల.. వైకుంఠపురములో తరవాత పూజా పారితోషికానికీ రెక్కలొచ్చాయి. గతేడాది విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లేటైనా సరే, ఫోకస్ తగ్గలేదంటే – దానికి కారణం.. పూజానే. తనే ఈ సినిమాని ముందుండి నడిపించింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్’లోనూ పూజా మ్యాజిక్ కనిపిస్తూనే ఉంది. 2022లో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే.. పూజా పేరే చెప్పాలి. అన్నీ బాగుంటే… ఈ సంక్రాంతికి `రాధేశ్యామ్` వచ్చేసేది. ఫిబ్రవరిలో ‘ఆచార్య’ ఉండేది. వరుసగా రెండు నెలల్లో రెండు సినిమాలు వచ్చేవి. కాకపోతే.. పరిస్థితులు బాగోకపోవడం వల్ల రాధేశ్యామ్ వాయిదా పడింది. ఆచార్య పరిస్థితీ అంతే. కాకపోతే… పూజాది లక్కీ హ్యాండ్ కదా, ఎప్పుడొచ్చినా సరే, ఈ సినిమాలకు ఢోకా ఉండదన్నది పూజా నమ్మకం.
”అల వైకుంఠపురములో సినిమా నా జీవితాన్ని మలుపు తిప్పింది. రేంజ్ పెరిగిందా, లేదా? అనేది నేను లెక్క పెట్టుకోలేదు. కానీ నాపై నాకు, నాపై పరిశ్రమకు నమ్మకం పెంచింది. అది చాలు. నా కెరీర్లో ఈ సినిమా ఎప్పటికీ మర్చిపోను” అని అల వైకుంఠపురములో విజయాన్ని తలచుకుని ఉప్పొంగిపోతోంది పూజా.