ఇది అసలే మల్టీస్టారర్ల కాలం. ఎప్పుడు ఏ హీరో, ఏ హీరోతో కలిసి నటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కథ రెడీ అయితే చాలు, రంగంలోకి దిగిపోతున్నారు హీరోలు. అందులోనూ ఓ అగ్ర దర్శకుడు పూనుకుంటే, ఇక చెప్పేదేముంది? అందులో భాగంగానే త్వరలో ఓ భారీ మల్టీస్టారర్ చూసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్లతో.. బోయపాటి శ్రీను ఓ సినిమా రూపుదిద్దుకొనే దిశగా అడుగులు పడుతున్నాయి. బాలయ్య అంటే బోయపాటి, బోయపాటి అంటే బాలయ్య అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇద్దరూ కలిస్తే.. రికార్డుల వేటే అన్నది అఖండతో మరోమారు స్పష్టమైంది. బోయపాటి ఏం చెప్పినా, చేసేసేందుకు బాలయ్య రెడీ. మరోవైపు బన్నీతోనూ అలాంటి అనుబంధమే ఉంది. సరైనోడుతో ఓ అదిరిపోయే హిట్ ఇచ్చాడు బోయపాటి. ఇప్పుడు మరోసారి బన్నీతో కలిసి సినిమా చేయబోతున్నాడు. బోయపాటి దగ్గర ఓ మల్టీస్టారర్ కథ ఉందట. అది బాలయ్య, బన్నీలకు పర్ఫెక్ట్ గా సరిపోతుందని తెలుస్తోంది.
బాలయ్య, బన్నీ, బోయపాటి.. ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందా? అనే ప్రశ్నకు బోయపాటి నేరుగా సమాధానం చెప్పలేదు కానీ.. ఆశాజనితమైన ఆన్సరే ఇచ్చాడు. “ఇక్కడ ఇది జరగదు అది జరగదు అని లేదు. ఏదైనా జరగొచ్చు…“ అని హింట్ ఇచ్చేశాడు. బోయపాటి దగ్గరైతే మల్టీస్టారర్ కథ ఉంది. అది చేయడానికి బాలయ్య రెడీనే. మరి బన్నీ ఏమంటాడో చూడాలి. `అన్స్టాపబుల్`తో అల్లు కుటుంబంతో బాలకృష్ణకు అనుబంధం మరింత బలపడింది. ఈ నేపథ్యంలో బాలయ్య, బన్నీ, బోయపాటి కాంబో… అసాధ్యమేం కాదు.