ఆర్థికంగా దెబ్బకొట్టకుండా ఉండటానికి ఎన్ని మాటలన్నా పడతారు.. ఎన్ని చేసినా కాళ్ల బేరానికి వస్తారని టాలీవుడ్‌పై ఏపీ అధికార పార్టీ పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎంత వ్యాపార ప్రయోజనాలు చూసుకున్నా ఆత్మగౌరవం మీద దెబ్బకొడుతూంటే చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. గత రెండు రోజుల నుంచి టాలీవుడ్ నుంచి ప్రముఖులు అనదగ్గరవారు స్పందించడం ప్రారంభించారు. ఫిలిం చాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ ప్రెస్‌మీట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తాన్ని అన్నట్లుగా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు.
ఇక వీఎన్ ఆదిత్యలాంటి రైటర్లు.. తమ స్పందనను రచనతోనే వెలిబుచ్చారు. అక్కడా ఘాటు తగ్గించలేదు. ఇంకా సైలెంట్‌గా ఉంటే.. రేపు ఇంకేమైనా అంటారని.. తమకు అసలు గౌరవమే లేకుండా చేస్తారని టాలీవుడ్ ముఖ్యులు అనుకున్నట్లుగా తేలింది. కొంత మంది ప్రభుత్వంపై మాట్లాడితే ఏం అవుతుందో.. ఎలాంటి కేసులు పెడతారో..ఎక్కడ ఆస్తుల ధ్వంసానికి పాల్పడతారో అని భయపడుతున్నారు. ఇప్పుడు.. వాటి కన్నా ఎక్కువగా ప్రజల్లో తమకు ఉన్న గౌరవ మర్యాదర్ని సైతం ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూంటే చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు కావాలనే.. సినీ పరిశ్రమను టార్గెట్ చేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. ఇండస్ట్రీని కాపాడుకోకపోతే … ఇంత కాలం జీవితం ఇచ్చిన పరిశ్రమకు కీడు చేసినట్లేనని ఎక్కువ మంది భావిస్తున్నారు. అందుకే ఇక ముందు కూడా రోజుకు ఒకరో ఇద్దరో తెర ముందుకు వచ్చి ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతల తీరుపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. పండగ తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఏకమైనా ఏపీ ప్రభుత్వం ఎంత దారుణంగా ఇండస్ట్రీని టార్గెట్ చేసిందో ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
వర్మ సినిమా టిక్కెట్ల అంశంపై ట్వీట్లు చేసినప్పుడు ప్రభుత్వంలో కాస్త ఆందోళ కనిపించింది. అందుకే సజ్జల టిక్కెట్ల వివాదం ముదరదని… సమసిపోతుందని చెప్పుకొచ్చారు. అయితే అక్కడా ఆయన సినిమా వ్యాపారం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సమస్యను సద్దుమణిగేలా చేసే ఉద్దేశం లేదని టాలీవుడ్ పెద్దలకు ఓ క్లారిటీ వచ్చింది.