రిపబ్లిక్ టీవీ చేసిన మ్యానిపులేటింగ్ కారణంగా న్యూస్ చానళ్లకు నిలిచిపోయిన బార్క్ రేటింగ్స్‌ను మళ్లీ పునరుద్ధరించాలని కేంద్రం ఆదేశించింది. దీంతో మళ్లీ రేటింగ్స్ ప్రకటించనున్నారు. రేటింగ్స్‌ను మ్యానిపులేట్ చేసిన కారణంగా బార్క్ మాజీ సీఈవో సహా 14 మంది అరెస్ట్ అయ్యారు. 14 నెలల కిందట రేటింగ్స్ ఆగిపోయాయి. తప్పుల్ని సరిదిద్ది మళ్లీ రేటింగ్స్‌ను ప్రారంభించాలని న్యూస్ చానళ్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం తక్షణమే రేటింగ్స్ పునరుద్ధరించాలని సమాచార, ప్రసార మంతృత్వ శాఖ ఈ రోజు బార్క్ ను ఆదేశించింది.
రేటింగ్ పద్దతిలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత మూడునెలల రేటింగ్స్‌ను కూడా నిజమైన ట్రెండ్ తెలిసేలా నాలుగు వారాల సగటు లెక్కించి ఇవ్వాలని ఆదేశించింది. సాధారణంగా శనివారం నుంచి శుక్రవారం వరకూ లెక్కించిన సమాచారాన్ని ఆ తరువాత వచ్చే గురువారం నాడు విడుదల చేస్తారు. ఆ విధంగా బార్క్ ప్రతి వారం అంతకు ముందు వారం రేటింగ్స్ ఇస్తుంది. ఇప్పుడు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నాలుగువారాల సగటు మాత్రమే ఇవ్వాలి.
లెక్కించిన వారంతో బాటు అంతకు ముందు మూడు వారాల సమాచారాన్ని కూడా కలిపి నాలుగు వారాల సగటు మాత్రమే న్యూస్ చానల్స్ కు బార్క్ వెల్లడిస్తుంది. దీనివలన ట్రెండ్ తెలుస్తుంది. అనారోగ్యకరమైన ధోరణులను కొంత మేరకు అడ్డుకోవటానికి ఇది పనికొస్తుందని భావిస్తున్నారు. న్యూస్ చానల్స్ తోబాటు మ్యూజిక్, మూవీస్, కిడ్స్, స్పిరిచ్యువల్, స్పోర్ట్స్ ఇలా వివిధ కేటగిరీల చానళ్లకు విడిగా రేటింగ్‌లు ప్రకటిస్తారు. వాణిజ్యప్రకటలను ఆకర్షించడంలో ఈ రేటింగ్‌లే టీవీ చానళ్లకు కీలకం.