గత ఏడాది ఆగస్టులోనే పేర్ని నాని చిరంజీవికి ఫోన్ చేసి.. ఇదిగో సీఎం అపాయింట్మెంట్ వచ్చి కలవండి అన్నారు. ఆ తర్వాత చిరంజీవే పలుమార్లు అపాయింట్మెంట్ అన్నారు కదా అని గుర్తు చేశారు. కానీ పట్టించుకోలేదు. హఠాత్తుగా చిరంజీవికి లంచ్ ఏర్పాటు చేసి ఆహ్వానం పంపారు. మీడియాకు గొప్పగా సమాచారం ఇచ్చారు. చిరంజీవికి జగన్ విందు అని చెప్పుకోవడం ప్రారంభించారు. ఇంత హఠాత్తుాగ ఎందుకిచ్చారు.. మంచు మనోజ్‌ను కలవడానికి కూడా తీరిక దొరికినప్పుడు ఇంత కాలం చిరంజీవిని ఎందుకు దూరం పెట్టారు.. ఇప్పుడు మాత్రమే ఎందుకు ఆహ్వానించారు ?
ఎందుకంటే ఇక్కడ టైమింగ్ ముఖ్యం. సినీ పరిశ్రమపై వైసీపీ నేతలు చేసిన విమర్శలపై ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ముఖ్యులు గొంతెత్తడం ప్రారంభించారు. కోవూరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై అదే రీతిలో స్పందించడం ప్రారంభించారు. నేడో రేపో చిత్ర పరిశ్రమ మొత్తం ఏకమై ప్రభుత్వంపై విరుచుకుపడటం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో ఒక్క సారిగా ప్రభుత్వం ట్రాక్ మార్చేసింది. చిరంజీవికి లంచ్ కి ఆహ్వానం పంపేసింది. ఇప్పుడు చిరంజీవి వెళ్తారు. ఆయనకు గొప్ప మర్యాదలు చేసినట్లుగా విజువల్స్ రిలీజ్ చేస్తారు. సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారన్నట్లుగా లీక్ ఇస్తారు.
అంటే.. ఇక ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తోంది కాబట్టి ఇలాంటి సమయంలో ఘాటు వ్యాఖ్యలు చేసి పరిస్థితిని దిగజార్చుకోవద్దు.. అనే సందేశాన్ని పంపుతున్నారన్నారన్నమాట. వైసీపీ వాళ్లు ఎన్ని మాటలన్నా… మనకు సమస్యల పరిష్కారం ముఖ్యం కాబట్టి ఆ దిశగా ప్రయత్నిద్దామనే సంకేతాన్ని చిరంజీవి కూడా తర్వాత ఇండస్ట్రీకి పంపే అవకాశం ఉంది. అంటే.. ఇండస్ట్రీ వైపు నుంచి వైసీపీపై జరిగే తిరుగుబాటు డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి ఈ లంచ్ భే్టీని టైమింగ్ ప్రకారం ఉపయోగించుకుంటున్నారన్నమాట.
నిజానికి ఏపీలో ఉన్న సమస్యలు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సృష్టించినే. దేశంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేయడం లేదు. కానీ ఏపీ ప్రభుత్వం చేస్తోంది. లెక్కలేనన్ని సమస్యలు సృష్టించి… కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేసి.. చివరికి రిలీఫ్ ఇచ్చి.. ఎంతో సాయం చేశామని చెప్పుకోవడమే అసలు ఉద్దేశం. అన్ని చోట్లా అదే జరుగుతోంది. ఈ విషయం ఇండస్ట్రీ గుర్తిస్తుందో లేదో చూడాలి !