మాచర్ల నియోజకవర్గంలో గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడ్ని గ్రామ నడిబొడ్డున వైసీపీ నేతలు హత్య చేశారు. ఇటీవల మాచర్ల ఇంచార్జ్‌గా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించారు. ఆయన నియోజకవర్గంలో చురుకుగా పర్యటిస్తూ అనుచరుల్ని సంఘటితం చేసుకుంటున్నారు. బ్రహ్మారెడ్డికి చంద్రయ్య ముఖ్య అనుచరుడు. ఈ క్రమంలో చంద్రయ్యను గ్రామ నడిబొడ్డున కాపు కాసి హత్య చేయడం సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై టీడీపీ నేతలంతా మండిపడ్డారు. హత్యా రాజకీయాల వారసుడు జగన్ పాలనలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల నడి రోడ్డుపై బుద్దా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావులపై హత్యాయత్నం చేస్తే నిందితుడికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారని … కానీ అప్పుడే శిక్షించి ఉంటే ఇలాంటి హత్యలు జరిగేవి కాదన్నారు. చంద్రయ్య కుటుంబానికి అండగా ఉంటాయమన్న చంద్రబాబు నేరుగా గుండ్లపాడు వెళ్లి చంద్రయ్య అంత్యక్రియల్లో పాల్గొనాలని నిర్ణయించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పల్నాడులో భయానక పరిస్థితులు ఉన్నాయి. మొదట్లోనే చాలా గ్రామాల్లో టీడీపీ సానుభూతిపరుల్ని తరిమేయడంతో అప్పట్లో వారి కోసం చంద్రబాబు చలో పల్నాడు కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ ఇంటి గేట్లు మూసేసి ఆయనను బయటకు వెళ్లనివ్వలేదు. ఆ తర్వాత వరుసగా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మాచర్ల స్థానిక ఎన్నికల్లో కనీసం నామినేషన్లు వేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలో హత్యలు జరుగుతూ ఉండటం కలకలం రేపుతోంది.