సర్వత్రా ఆసక్తి కలిగించిన జగన్ చిరంజీవి భేటీ ముగిసింది. భేటీ అనంతరం ఎయిర్ పొర్టులో చిరంజీవి మీడియా సమావేశం నిర్వహించి భేటీ వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..
ముందుగా ఈ పండుగ సందర్భంగా లంచ్ కి ఆహ్వానించి ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా, కొసరి కొసరి వడ్డించిన జగన్ దంపతులకు చిరంజీవి కృతజ్ఞతలు తెలియ జేశారు. అయితే జగన్ మోహన్ రెడ్డి సామాన్యుడి కి వినోదం అందించాలన్న ఉద్దేశంతో ఉన్నారని, టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండాలన్న కృత నిశ్చయంతో ఉన్నారని , అది మంచిదేనని అభినందించిన చిరంజీవి, తమ వైపు ఉన్న కష్టాలను కూడా ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలియజేశారు.
పరిశ్రమ అంటే పూల పాన్పు కాదని, రెక్కాడితే తప్ప డొక్కాడని వేల మంది కార్మికులు సినిమా పరిశ్రమలో ఉంటారని, లాక్ డౌన్ సమయం లో తామంతా కొన్ని నెలల పాటు వారికి నిత్యవసర వస్తువులు అందించామని గుర్తు చేసిన చిరంజీవి, ఇటువంటి కార్మికుల సమస్యలే కాకుండా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మరియు నిర్మాతల సమస్యలు కూడా ముఖ్య మంత్రి కి వినిపించినట్లు దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు. అన్ని వైపులా ఆలోచించి అందరినీ సమదృష్టితో చూసి, సినీ పరిశ్రమకు అనుకూలంగా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారన్న భరోసా సీఎం ఇచ్చారని చిరంజీవి తెలియజేశారు. మరొకవైపు జీవో 35 నీ తిరిగి పరిశీలించి, సవరించి పరిశ్రమకు అనుకూలంగా ఉండేలా జీవో తీసుకు వచ్చే అవకాశం ఉందని, ఆ నమ్మకం తనకుందని చిరంజీవి తెలియజేశారు. బెనిఫిట్ షో ల విషయంలో కూడా సీఎం సానుకూలం గా స్పందించారని అన్నారు చిరంజీవి.
మరో వారం పది రోజుల లోపు పరిశ్రమ కు అనుకూలమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఈ లోపు పరిశ్రమ కు సంబంధించిన వ్యక్తులు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం వంటివి చేయకుండా సంయమనం పాటించాలని పరిశ్రమ కు సూచించారు చిరంజీవి. అదే విధంగా త్వరలోనే ఈ సమస్యలన్నింటికీ ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పిన చిరంజీవి అవసరమైతే త్వరలోనే పరిశ్రమ పెద్దలతో కలిసి మరొక సారి ముఖ్య మంత్రి తో భేటీ అవుతానని వ్యాఖ్యానించారు
సినీ పరిశ్రమ నుండి ఈ భేటీ పట్ల ఎటువంటి స్పందన వస్తుంది అన్నది వేచి చూడాలి.