చిత్రసీమకు, జగన్ కూ ఓ అనుకోని గ్యాప్ ఉన్న మాట వాస్తవం. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే, చిత్రసీమ తరపున ఓ బృందం అంటూ వెళ్లి కలవలేదు. సన్మానమూ చేయలేదు. అసలు తనని చిత్రసీమ ముఖ్యమంత్రి గానే గుర్తించలేదని, జగన్ బాధపడ్డారని, ఆయన మనుషులే చెబుతుంటారు. `మీ దృష్టిలో మా నాయకుడు ముఖ్యమంత్రే కాదా` అని చిత్రసీమని ఉద్దేశించి మంత్రులు కోపోద్రేకానికి గురైన దాఖలాలూ ఉన్నాయి. అప్పట్లో సీఎంని కలవకపోవడం వల్లే, ఇప్పుడు ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నది కొంతమంది నిర్మాతల వాదన.
ఏదేమైనా ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడుతున్నాయి. జగన్- చిరంజీవి భేటీ వల్ల ఈ సమస్య పరిష్కారానికి ద్వారాలు తెరచినట్టైంది. ఇప్పుడు కాకపోయినా, అతి త్వరలో ఈ సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయి. వచ్చినా, రాకపోయినా, పరిశ్రమ జగన్ నిర్ణయాలతో హ్యాపీగా ఉన్నా, లేకపోయినా.. అతి త్వరలో పరిశ్రమ తరపున జగన్ కి ఓ భారీ సన్మాన కార్యక్రమం జరగబోతోందని ఓ టాక్. టాలీవుడ్లో కొంతమంది అగ్ర నిర్మాతలు ఓ కమిటీగా ఏర్పడి జగన్ కి సన్మానం చేయాలన్న ప్రతిపాదన తెచ్చారని టాక్.
అప్పట్లో.. అంటే జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే ఈ ప్రతిపాదన వచ్చిందట. కానీ కొంతమంది నిర్మాతలు `వద్దు` అంటూ వెనక్కిలాగారని, అందుకే సన్మానం జరగలేదని టాక్. ఈ విషయమై ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ స్పందించారు. అప్పట్లోనే జగన్ ని సన్మానించాలని అనుకున్నామని, కానీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదని, చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన జగన్ అంటే పరిశ్రమలో వ్యక్తులందరికీ గౌరవం ఉందని, ఆయన్ని పట్టించుకోలేదనో, సన్మానం చేయలేదనో ఆయన కోపగించుకునే వ్యక్తి కాదని, ఆయన అంత సంకుచిత స్వభావి కాదని, అయితే ఆయన్ని త్వరలోనే సన్మానిస్తామని ఎన్వీ ప్రసాద్ ఓ టీవీ ఛానల్ లైవ్ డిబేట్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే, పరిశ్రమ ఏకమై.. సీఎం జగన్ సన్మాన కార్యక్రమం తలపెట్టే రోజు ఎంతో దూరంలో లేదన్న విషయం అర్థమవుతూనే ఉంది.