ప్రపంచంలోనే ప్రముఖ స్టీల్ ఉత్పత్తి దారు అయిన పోస్కో సంస్థతో ఇండియాలో ఆటోమేటిక్‌గా ఎదిగిన అదానీ సంస్థ కలిసి స్టీల్ రంగంలోకి అడుగు పెడుతోంది. ఇప్పటి వరకూ చాలా విభాగాల్లోకి అడుగు పెట్టిన అదానీ.. తాజాగా ఉక్కు తయారీ రంగంలోకీ దిగాలని నిర్ణయించకుంది. దక్షిణ కొరియాకు చెందిన పోస్కోతో కలిసి సమగ్ర స్టీల్ ప్లాంట్‌ను గుజరాత్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రెండు కంపెనీల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ ప్లాంట్ కోసం రెండు కంపెనీలు దాదాపు రూ.37వేల కోట్లు పెట్టనున్నాయి. గుజరాత్‌లోని ముంద్రా వద్ద ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.
పోస్కోతో ఈ స్టీల్ భాగస్వామ్యం అదానీ కొనసాగిస్తుందా లేకపోతే.. స్టీల్ ప్లాంట్ ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయడం కష్టం కాబట్టి… రెడీగా ఉన్న సంపదతో.. రెడీగా ఉన్న స్టీల్ ప్లాంట్ ను కొనేయడం బెటర్ అన్న ఉద్దేశంతో అమ్మకానికి పెట్టిన స్టీల్ ప్లాంట్‌కు టెండర్ వేసే ఆలోచన చేస్తారా అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కొనుగోలు చేసే ఉద్దేశంతోనే.. లేకపోతే విస్తరణ కోసమో కానీ పోస్కో ప్రతినిధులు పలుమార్లు సందర్శించారు. ఆసక్తి చూపించారు.
అదే విధంగా అదానీకి ఏపీపై చాలా ఆసక్తి ఉంది. పోర్టులన్నీ అదానీ పరం అయ్యాయి. స్టీల్ ప్లాంట్ అనుబంధం ఉన్న పోర్టు కూడా అదానీ కొనేశారు. ఇప్పుడు… పోస్కో ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకూ ఆయన టెండర్ వేయవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అడుగులు పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.