చిరంజీవిని సీఎం జగన్ లంచ్‌కు ఆహ్వానించారు. చిరంజీవి వచ్చారు. భారతిగారు వడ్డించారని ఆహ్వానం అదిరిందని చిరంజీవి కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సినిమా పరిశ్రమ సమస్యలపై మాట్లాడుకున్నామని చిరంజీవి చెప్పారు. అయితే తాజాగా వారిద్దరి మధ్య రాజకీయాలు కూడా చర్చకు వచ్చాయని కొన్ని ఇంగ్లిష్ పత్రికలు చెబుతున్నాయి. త్వరలో ఖాళీ కాబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి చిరంజీవికి జగన్ ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే దీనిపై చిరంజీవి స్పందనేమిటో మాత్రం స్పష్టత లేదు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీట్ల భర్తీలో రాజకీయ అవసరాలు… సమీకరణాలు పక్కాగా చూసుకుంటారు. అందుకే గతంలో రిలయన్స్‌కు చెందిన నత్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చారు. వచ్చే జూన్‌లో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవబోతున్నాయి. నాలుగు కూడా వైసీపీకి ఏకగ్రీవం అవుతాయి. ఈ క్రమంలో కొత్త వర్గాలను ఆకట్టుకోవడానికి.. జనసేన పార్టీ ప్రభావాన్ని వీలైనంత వరకూ తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి చిరంజీవికి రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లుగా వైసీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో కాపు వర్గాలు యాక్టివ్ అవుతున్నాయి. ఒక వేళ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అధికారంలో భాగస్వామ్యం వస్తుందన్న కారణంగా ఆ వర్గాలు ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంటుంది. అదే జరిగితే వైసీపీ నష్టం ఎక్కువ. ఇప్పుడు చిరంజీవి రాజ్యసభ సీటుకు అంగీకరిస్తే వైసీపీలో చేరాల్సి ఉంటుంది. అదే జరిగితే .. చాలా వరకూ కాపు వర్గాన్ని ఆకట్టుకోవచ్చని జగన్ ఆలోచనగా చెబుతున్నారు.
అయితే రాజ్యసభ సీటు కోసం చిరంజీవి వైసీపీలో చేరుతారని ఎవరూ అనుకోవడం లేదు. ఆయన ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్ని పూర్తిగా వదిలేశారు. తానిక రాజకీయాల్లో రానని ప్రత్యక్షంగా సందేశం కూడా పంపారు. అయితే పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు కాబట్టి ఆలోచించవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా ఉత్తదేనని.. వైసీపీ కేవలం కాపు వర్గంలో గందరగోళం సృష్టించడానికి అనుకూల మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు కానీ అలాంటి ఆఫర్ ఏమీ ఇవ్వలేదని… జనసేన వర్గీయులు చెబుతున్నారు.