మాచర్ల నియోజకవర్గంలోని గుండ్ల పాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడ్ని వైసీపీ ఎంపీపీ శివరామయ్య చంపడానికి పోలీసులు కారణాలు కనిపెట్టారు. సిమెంట్ రోడ్ విషయంలో శివరామయ్యకు.. చంద్రయ్యకు మధ్య గొడవలు ఉన్నాయట. ఈ కారణంగా కొంత మంది శివరామయ్యను కలిసి చంద్రయ్య దాడి చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారని చెప్పారట. దాంతో శివరామయ్యే తమపై దాడి చేయడానికి ముందే చంపేయాలని నిర్ణయించుకుని… పట్ట పగలు అందరూ చూస్తూండగా దారి కాచి.. పీక కోసి చంపేశారట. ఈ విషయాలన్ని గుంటూరు ఎస్పీ స్వయంగా వెల్లడించారు.
నిందితులకు ప్రాణభయంతో .. ప్రాణం కాపాడుకునేందుకు హత్యలు చేశారన్నట్లుగా ఎస్పీ విశాల్ గున్నీ చెప్పిన ఈ స్టోరీ చెప్పడం టీడీపీ నేతలను కూడా ఆశ్చర్య పరుస్తోంది. దాడిచేస్తారని ఎవరో శివరామయ్యకు చెప్పడం.. వారు దాడి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా పోలీసులు తేల్చడం న్యాయనిపుణుల్ని కూడా ఆశ్చర్య పరిచేదే. ఏపీలో ఉన్న పరిస్థితుల్లో టీడీపీ నేతలు దాడుల నుంచి కాపాడుకునే పరిస్థితి లేదు.. ఎదురుదాడి చేసే ఆలోచనే చేసే అవకాశమే లేదు. మాచర్ల లాంటి చోట్ల అసలు ఉండదు. నిందితుల్ని వీలైనంత వరకూ బయటపడేసే ప్రయత్నం కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తంగా వైసీపీకి చెందిన వెల్దుర్తి ఎంపీపీ శివరామయ్యతో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లుగా ఎస్పీ ప్రకటించారు. అయితే ఎమ్మెల్యేనే రెచ్చగొట్టి హత్య చేయించారని.. చంద్రయ్య కుమారుడు ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోలేదు. ఎమ్మెల్యేకు సంబంధం లేదని పోలీసులు తేల్చారు. మొత్తంగా మాచర్లలో అత్యంత పాశవికమైన హత్య.. చంపేస్తారనే భయంతో వాళ్లే చంపేశారన్న కోణంలో ప్రజెంట్ చేస్తున్నారు పోలీసులు.