టీఆర్ఎస్ లో నిరుద్యోగుల అసంతృప్తి ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగాల భర్తీ కోసం వారు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఆ అసంతృప్తిని ఆసరాగా చేసుకుని రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయి. అదే సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇంత వరకూ అమలు చేయలేదు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి పథకాన్ని కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారు. అవసరం వచ్చినప్పుడల్లా ఇదిగో నిరుద్యోగ భృతి అన్నారు కానీ.. ఎలాంటి ముందడుగు లేదు. వచ్చే బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించి.. ఎలాగోలా అమలు చేయాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ ఉంది.
2018 ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైనవవి రైతుల రుణమాఫీ, నిరుద్యోగ భృతి. రైతుల రుణమాఫీ కొంత మేర చేశారు. ఇంకా చాలా మందికి చేయాల్సి ఉంది. నిరుద్యోగ భృతి గురించి ఇంత వరకూ ఆలోచన చేయలేదు. నిజానికి 2019 మార్చిలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిరుద్యోగ భృతి కోసం రూ.1810 కోట్లు కేటాయించారు. నిరుద్యోగులకు నెలకు రూ.3016 లకు భృతిగా అందచేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ రూపాయి కేటాయించలేదు… పథకం అమలు చేయలేదు. తర్వాత అసలు కేటాయింపులు కూడా లేవు
తెలంగాణలో నిరుద్యోగులు 35 లక్షల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.టీఎస్పీఎస్సీ పోర్టల్లో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు. లక్షల మందికి నెలకు జీతం ఇచ్చినట్లుగా రూ.3016 ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. ఆర్థిక కష్టాల్లో ఉన్న తెలంగాణ సర్కార్కు ఇబ్బందికరమే. కానీ హామీలను అమలు చేయక తప్పని పరిస్థితి. ఇప్పటికే రైతు బంధు పేరుతో అతి పెద్ద భారం నెత్తి మీద వేసుకున్న కేసీఆర్కు ఇవన్నీ కొత్త తలనొప్పులు సృష్టించే అవకాశం కనిపిస్తున్నాయి.