పార్టీ కోసం పని చేసే వారికే జగన్ రాజ్యసభ టిక్కెట్ ఇస్తారు… ఎవరినో తెచ్చి ఇవ్వాల్సిన అవసరం జగన్కు లేదు.. అంటూ టీటీడీ చైర్మన్, జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి స్పందించారు. చిరంజీవికి జగన్ రాజ్యసభ ఆఫర్ ఇచ్చారని వచ్చిన వార్తలపై సుబ్బారెడ్డి ఇలా స్పందించారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ముగిసిపోయింది. చిరంజీవి ఈ వార్తలను ఖండించారు . తాను పూర్తిగా రాజకీయాలకు దూరమన్నారు. దీంతో వైసీపీ నేతలు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. ఎవరినో తీసుకొచ్చి రాజ్యసభ ఇవ్వాల్సిన అవసరం లేదని… పార్టీ కోసమే పని చేసిన వారికి మాత్రమే జగన్ ఇస్తారని కవరింగ్ ప్రయత్నాలు చేస్తున్నారు.
అందులోనూ సుబ్బారెడ్డికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఆయన రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఆయనకు నామినేటెడ్ పోస్టులతోనే సరి పెడుతున్నారు. టీటీడీ చైర్మన్తో పాటు రాజ్యసభ కూడా ఇవ్వాలని జగన్ను కోరుతున్నారు. కానీ ఇంత వరకూ క్లియరెన్స్ రాలేదు. అందుకే తాను పార్టీ కోసం కష్టపడుతున్నానని… తన వంటి వారిని గుర్తించాలన్నట్లుగా ఆయన స్టేట్మెంట్ ఉంది.
అయితే పరిమళ్ నత్వానీ.. వైసీపీ కోసం ఎప్పుడు పని చేశారని.. ఆయనకు రాజ్యసభ ఎందుకు ఇచ్చారని వైసీపీలోనే కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం పని చేసేవారిని కాదని… రాజకీయ అవసరాల కోసమే.. జగన్ రాజ్యసభ సీట్లు కేటాయిస్తారన్న ఓ అభిప్రాయం అందరిలోనూ ఉంది. అయితే సుబ్బారెడ్డి మాత్రం పార్టీ కోసం కష్టపడేవారికి ఇవ్వాలని తనను తాను చూపిస్తున్నారు. జగన్ అర్థం చేసుకుంటారో లేదో మరి !