సంక్రాంతి అంటే కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేలు మాత్రమే. అందరూ ఆనందోత్సాహాలతో పండుగలు చేసుకున్నా ఎవరికీ పట్టదు. అందరూ అక్కడ జరిగే కోడి పందెలను మత్రమే చూస్తారు. ఇతర చోట్ల జూదరులు పండుగ చేసుకున్నా.. చేసుకోకపోయినా కోడి పందేలకు మాత్రం పరుగులు పెట్టి బరుల వద్దకు వస్తారు. ఈ సారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా.. ఒమిక్రాన్ ఇలాంటి వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. డబ్బు కట్టలతో వస్తున్నారు. ఉత్త చేతులతో వెళ్తున్నారు.
ఈ సారికోడి పందేల్లో విచిత్రం ఏమిటంటే.. దొంగ నోట్లతో పందేలు కాయడం. చాలా చోట్ల దొంగ నోట్లతో పందేలు కాస్తున్నారని ప్రచారం జరుగుతూండటంతో… అన్ని చోట్లా దొంగనోట్లను డిటెక్ట్ చేసే యంత్రాలను పెట్టుకుని పందేలు కాసుకుంటున్నారు. పెద్ద బరులు.. మోతుబరులు అయితే ఏకంగా ఆన్ లైన్ విధానానికి వెళ్లిపోయారు. సంక్రాంతి సంబరాల్లో కోడి పందేలు కూడా ఓ భాగం. కానీ అది రాను రాను వ్యసనంగా మారిపోతోంది. ఇందులోనూ రాజకీయం చొరబడటమే కారణం.
కోడి పందేల బరులు.. ఇతర జూద కార్యక్రమాలు ఏర్పాటు చేసి..మధ్యలో కమిషన్ నొక్కేయడాన్ని రాజకీయ నేతలు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఫలితంగా రాను రాను ఈ జూద సంస్కృతి పెరిగిపోతోంది. పండుగ సందడి తగ్గిపోతోంది. నిజానికి కత్తులు కట్టి కోడి పందేలు ఆడటానికి అసలు పర్మిషన్ లేదు. కోర్టులైనా ప్రభుత్వమైనా.. కోడి కత్తులు లేకుండా ఆడుకోమని చెబుతోంది. కానీ ఎవరూ వినే పరిస్థితి లేదు. అలాగని కట్టడి చేసే పరిస్థితి కూడా లేదు. అందుకే కాపలా కాయడం తప్ప … ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి.