సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో తనదైన బాట పడుతున్నారు. పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలు చేసినా.. చేయకపోయినా.. తాను మాత్రం ప్రభుత్వంపై పోరాడుతున్నాననన్న అభిప్రాయాన్ని కల్పించడానికి ఏదో ఓ ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు. గతంలో ఇంటర్ విద్యార్థులందర్నీ పాస్ చేయాలన్న డిమాండ్‌తో ప్రగతి భవన్ ముట్టడికి జగ్గారెడ్డి ప్రయత్నించారు. మరోసారి అలాంటి ప్రోగ్రామే పెట్టుకున్నారు. 17వ తేదీన సీఎం అపాయింమెంట్ అడిగారు. అనేక సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇవ్వకపోతే ప్రగతి భవన్ వద్ద దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే హఠాత్తుగా ఆయనకు సీఎల్పీ బ్రేక్ వేసింది. సంక్రాంతి పండుగ రోజు జూమ్ మీటింగ్ నిర్వహించేసి… సీఎల్పీ ఉమ్మడి పోరాటం చేయాలని జగ్గారెడ్డి ఒక్కటే కాదని నిర్ణయించారు. 17వ తేదీన జగ్గారెడ్డి చేయాలనుకున్న దీక్ష ను వాయిదా వేసుకోవాలని, ఆ స్థానంలో సీఎల్పీ లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు సిఎం కేసీఆర్ కు లేఖ రాయాలని సిఎం అపాయింట్ మెంట్ అడగాలని, ఆయన కలిసేందుకు సమయం ఇవ్వకపోతే ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించారు. దానికి జగ్గారెడ్డి కూడా అంగీకరించాల్సి వచ్చింది.
18,19 తేదీలలో సిఎం ను కలిసి పలు అంశాలపై వినతి పత్రం ఇస్తామని లేనిపక్షంలో పోరాటం చేస్తామని సీఎల్పీ ప్రకటించింది. ఈ లోపు మిర్చి రైతుల పరిస్థితి వడగళ్ల వర్షాలకు దెబ్బతిన్న అంశాలపై సీఎల్పీ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. మొత్తంగా జగ్గారెడ్డిని కాస్త కంట్రోల్‌లో పెట్టే విషయంలో సీఎల్పీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. లేకపోతే.. కాంగ్రెస్‌ది ఓ దారి.. జగ్గారెడ్డిది మరో దారి అన్నట్లుగా పరిస్థితి మారిపోయేది.