టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జాతీయ రాజకీయాలపైనా తనదైన మార్క్ చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన యూపీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. యూపీలో ఏడు విడతల ఎన్నికల్లో తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కరోనా ఆంక్షల కారణంగా భారీ ప్రచారసభలు.. ర్యాలీలకు అవకాశం లేదు. డోర్ టు డోర్ ప్రచారం మాత్రమే జరుగుతోంది .
కేటీఆర్ ఈ తరహా ప్రచారం చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఒక్క ప్రచారం మాత్రమే కాదని.. అఖిలేష్‌కు టీఆర్ఎస్ తరపున అన్ని రకాల ఎన్నికల సహాయసహాకారాలు అందించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మూడో కూటమి వ్యూహంతో ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆర్థికంగా సాయం చేయడంలో టీఆర్ఎస్ కీలకంగా వ్యవహరిస్తోందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. గతంలో కేసీఆర్ .. జేఎంఎంకు ఎన్నికల ఫండ్ పంపారన్న గుసగుసలు కూడా వినిపించాయి.
ఈ క్రమంలో అఖిలేష్‌కు కూడా ఈ తరహా ఆర్థిక సాయం.. టీఆర్ఎస్ నుంచి అందుతోందని చెబుతున్నారు. టీఆర్ఎస్కు అత్యంత సన్నిహితులైన కాంట్రాక్టర్లకు దేశవ్యాప్తంగా ప్రాజెక్టులున్నాయి . సమాజ్ వాదీకి నిధులు సర్దాలంటే కేసీఆర్‌కు పెద్ద విషయం కాదు. అయితే రాజకీయాల్లో ఇలాంటివన్నీ ఉహాగానాలుగానే ఉంటాయి. కేసీఆర్ ఆర్థిక సాయం చేశారో లేదో ఆయనకు లేదా.. సమాజ్ వాదీ పార్టీకి మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలియదు. కానీ గుసగుసలు మాత్రం కామనే.